ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లుల మోత మోగుతోందని నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు నిర్వహించారు.
కడప అగ్రికల్చర్: ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లుల మోత మోగుతోందని నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు నిర్వహించారు. మైదుకూరు మండలం అన్నలూరులో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రజలను కలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలు మాట్లాడుతూ ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలమైన తమకు కరెంటు బిల్లుల భారం ఉండేదికాదని అన్నారు. ఈ మాయదారి ప్రభుత్వం వచ్చాక బిల్లులు వేలల్లో వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు హామీలను భారీగా ఇచ్చినా ఇంతవరకు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. నందలూరు మండలం రాచపల్లె, ఇసుకపల్లెల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ప్రజలు మాట్లాడుతూ 108, 104 వాహనాలు అందుబాటులో ఉండటం లేదని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, వాటిని అందుబాటు ఉండేలా చూడాలని కోరారు.