రైతు సమగ్ర సర్వేను అమలు చేయాలి

రైతు సమగ్ర సర్వేను అమలు చేయాలి - Sakshi


► జిల్లాలో 6,05,674 ఎకరాల్లో 2.48 లక్షల మంది రైతులుగా గుర్తించాం

► 10వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలి

► వ్యవసాయాధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
ఖమ్మం: రైతు సమగ్ర సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీసీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో జిల్లాలో చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వే వివరాలను మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రైతు సమగ్ర సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 6,05,674 ఎకరాల్లో 2,00,048 మంది రైతులు సాగు చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు.వారిలో అర్హులైన ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా వారి సమాచార వివరాలను నమోదు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్లాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో రైతు సమగ్ర సర్వే ప్రక్రియలో సేకరించిన వివరాలతో వ్యత్యాసాలు రాకుండా పక్కాగా రూపొందించాలన్నారు. సర్వే నిర్వహించిన వివరాలను పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో రీవెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి సమగ్ర నివేదిక రూపొందించాలని, ప్రతిరోజు రీవెరిఫికేషన్‌ చేసిన వివరాలను వెంటవెంటనే కంప్యూటరీకరించేందుకు సత్వర చర్యలు చేపట్టాని సూచించారు. భూసేకరణ కింద సేకరించిన ప్రభుత్వ భూముల వివరాలను రైతు సమగ్ర సర్వేలో నమోదుగాకుండా చూడాలన్నారు. సమావేశంలో ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఆర్‌.శ్రీనివాసరావు, వివిధ స్థాయిల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top