
అమరావతి మెట్రోపై కేంద్రం కొర్రీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాజెక్టు రిపోర్టుపై కేంద్రం కొర్రీలు వేసింది.
ఏపీ సర్కారు పంపిన ప్రాజెక్టు రిపోర్టుపై అన్నీ సందేహాలే!
హోం, విమానయాన, రైల్వే శాఖల నుంచి అభ్యంతరాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాజెక్టు రిపోర్టుపై కేంద్రం కొర్రీలు వేసింది. గతేడాదే మెట్రో రైలుకు బ్రేకులు వేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన అరకొర రిపోర్టుపై అనేక సందేహాలు లేవనెత్తింది. గత కొంతకాలం నుంచి ప్రాజెక్టు రిపోర్టుపై అధ్యయనం చేసిన కేంద్రం పలు సూచనలు చేసింది. రూ.6,769 కోట్లతో మెట్రో రైల్ నిర్మాణానికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీపీఆర్ మొత్తం అసమగ్రంగా ఉందని, పలు శాఖల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలకు సమాధానం పంపించాలని కేంద్రం సూచించింది.
హోం శాఖ అభ్యంతరాలివి
మెట్రో రైల్ నిర్మాణంలో భద్రత అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల దాడులు జరిగితే తీసుకునే భద్రత చర్యలపై ప్రాజెక్టు రిపోర్టులో ఎక్కడా పేర్కొనలేదని, పైగా మెట్రో రైల్వే స్టేషన్లలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లకు స్థలం ఎక్కడ కేటాయించారని ప్రశ్నించింది. మెట్రో స్టేషన్లలో పేలుళ్లు సంభవిస్తే ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు చేపడతారనే అంశం రిపోర్టులో ప్రస్తావించలేదని పేర్కొంది.
ఫ్లాట్ ఫాం స్కీన్ డోర్‌లు, పగలని గ్లాస్ డోర్లు ఏర్పాటుపైనా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాజెక్టు రిపోర్టులో బ్యాక్ అప్ కంట్రోల్ సెంటర్లపై సమాచారం కూడా ఇవ్వలేదని తప్పు పట్టింది. మెట్రో రైల్ వ్యవస్థ మొత్తం నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని, కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీ కనీసం 90 రోజులు నిక్షిప్తమయ్యేలా ఉండాలని సూచించింది. మెట్రో ప్రాజెక్టుపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఐబీ) అందించే సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
రైల్వే అనుమతులు ఉన్నాయా?
మెట్రో రైల్ నిర్మాణం చేపట్టినప్పుడు సాధారణ రైల్వే స్టేషన్లు మెట్రో పరిధి కిందకు వస్తున్నందున రైల్వే శాఖ అనుమతులు తప్పనిసరని స్పష్టం చేసింది. దక్షిణ మధ్య రైల్వే అనుమతి ఉందా? లేదా? అనే విషయం స్పష్టం చేయాలని కేంద్రం ప్రశ్నించింది. మెట్రో రైలు నిర్మాణం నిడమానూరు వరకు జరుగుతున్నందున దగ్గర్లోనే ఉన్న గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించాలని విమానయాన శాఖ సూచించింది.
విజయవాడ, విశాఖపట్టణంలలో మెట్రో రైల్ నిర్మాణం చేపడతామని కేంద్రం విభజన చట్టంలో హామీనిచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని మెట్రో ప్రాజెక్టుపై అసమగ్రంగా ప్రాజెక్టు రిపోర్టు పంపించడంతో కేంద్రం కొర్రీలు వేయడం గమనార్హం. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై త్వరలో వివరణాత్మకమైన నివేదిక పంపుతామని ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.