‘నామ్‌’ కే వాస్తే..! | central government aims to have a fair price for farmers | Sakshi
Sakshi News home page

‘నామ్‌’ కే వాస్తే..!

Jan 23 2017 1:11 AM | Updated on Oct 1 2018 2:09 PM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం (నామ్‌)ను ప్రవేశపెట్టింది.

తిరుమలగిరి : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం (నామ్‌)ను ప్రవేశపెట్టింది. 2016 ఏప్రిల్‌ 14న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని వ్యవసాయ మార్కెట్‌లో ప్రారంభించి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇతర ప్రాంతాల నుంచి మాత్రం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు నోచుకోవడం లేదు. దీనికి కారణం ఈ–నామ్‌ను ప్రారంభించిన అధికారులు ఇతర మార్కెట్‌లో ఉండే కొనుగోలుదారులకు వీలయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంను తయారు చేసే విధానంలో విఫలమయ్యారు. దీంతో గతంలో లాగానే ఏ మార్కెట్లో ఉన్న ట్రేడర్లు ఆ మార్కెట్‌లోనే సరుకులను కొనుగోలు చేస్తున్నారు.

మొదట తిరుమలగిరి మార్కెట్‌లోనే...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక సరుకులు వచ్చే మార్కెట్‌గా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. సంవత్సరం పొడవునా సరుకులు వస్తుండడంతో క్రయ విక్రయాలు సాగుతాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఈ–నామ్‌ విధానాన్ని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో కూడా ప్రారంభించారు. మొదటి రోజు మాత్రం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు సంబంధించిన ట్రేడర్లు ఇక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొదటి రోజు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. తొమ్మిది నెలలు దాటుతున్నా ఈ విధానం ద్వారా ట్రేడింగ్‌ అమలు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ–నామ్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ట్రేడర్లు ఆన్‌లైన్‌లో చూసి పోటీ పడితే తమ దిగుబడులకు అధిక ధర వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.

కొనుగోలు విధానం ఇది...
మార్కెట్‌లోకి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుని రాగానే గేట్‌ ఎంట్రీలోనే రైతు వివరాలు, సరుకుల పరిమాణం, ఊరు పేరు, ఏ కమీషన్‌కు తీసుకుని వెళుతున్నాడో తెలుసుకుని ఒక ఐడీని ఇస్తారు. ఆ ఐడీని సరుకులపై ఉంచుతారు. తదుపరి వివరాలను మార్కెట్‌ సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. కొనుగోలుదారులు రైతులు తీసుకొచ్చిన సరుకుల ఐడీతో ఈ–బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. అందులో అత్యధికంగా ఏ ధరకు కొనుగోలు చేశారన్నది ఆన్‌లైన్‌లో వెంటనే తెలిసిపోతుంది. ఆన్‌లైన్‌లో వ్యాపారస్తులు కోరిన గరిష్ఠ ధర పండించిన రైతుకు గిట్టుబాటు అనిపిస్తే అదే ధర వద్ద అమ్ముకునేందుకు అనుమతిస్తే మార్కెట్‌ సిబ్బంది అంగీకారం తెలిపి క్రయవిక్రయాలు కొనసాగిస్తారు. అందుకు ధర సరిపడా మార్కెట్‌ చార్జీలు రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వ్యాపారి రైతు ఖాతాలో నగదును జమ చేస్తాడు. రైతులకు కొనుగోలుదారులకు మార్కెటింగ్‌ శాఖ అనుసంధానకర్తగా పని చేస్తుంది. ఈ విధానం ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రేడర్లు ఆన్‌లైన్‌ ద్వారా చూసి బిడ్డింగ్‌ వేయాల్సిఉండేది. కానీ, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం లేకపోవడంతో కేవలం ఆ మార్కెట్‌లో ఉన్న ట్రేడర్ల ద్వారానే ఈ విధానం అమలవుతోంది. స్థానిక మార్కెట్‌లో ఉన్న ట్రేడర్లలో ఎవరు ఎక్కువ ధరకు కోడ్‌ చేస్తే వారికే రైతులు సరుకులు అమ్ముకుంటున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం లేదు...
మార్కెట్‌లో నామ్‌ విధానం ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి ట్రే æడింగ్‌ చేయడానికి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం లేకపోవడంతో వేరే ప్రాంతం నుంచి కొనుగోళ్లు జరగడం లేదు.

– నవీన్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement