లంచావతారం అయితేనేం! | bribe so what | Sakshi
Sakshi News home page

లంచావతారం అయితేనేం!

Published Sun, May 28 2017 11:25 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

లంచావతారం అయితేనేం! - Sakshi

- నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
- టీడీపీ పాలనలో అవినీతి అధికారులకు అందలం! 
- అధికారి పార్టీ నేతల సిఫార్సులతో
  పోకల్‌ స్థానాల్లో పోస్టింగులు
- ఏసీబీ అధికారులకు పట్టుబడినా..
  అవినీతి కేసులు ఉన్నా పట్టని వైనం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): మూడేళ్ల క్రితం కర్నూలుకు 40 కిలో మీటర్ల దూరంలోని ఓ మండలానికి ఆయన ఇన్‌చార్జీ తహసీల్దారుగా ఉన్నారు. అదే మండలానికి చెందిన రైతుకు పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడానికి లక్షల రూపాయాలు లంచం డిమాండ్‌ చేశారు. కర్నూలులోని తన నివాసంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టీడీపీ నేతల అండదండలతో బదిలీల్లో ఆయనకు కీలకమైన శాఖలో ముఖ్యమైన పోస్టును కట్టబెట్టారు.
 
నాలుగేళ్ల క్రితం పోకల్‌ మండలానికి తహసీల్దార్‌గా ఉండి.. ప్రభుత్వ స్థలాలను పప్పులు పంచినట్లుగా పంపిణీ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ఆ తహసీల్దార్‌ను అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అధికారులపైకి కుక్కలను వదిలిన ఘన చరిత్ర ఆ అధికారిది. రిమాండ్‌లో భాగంగా జైలులో కూడా ఉన్నారు. తర్వాత పెండింగ్‌ ఎంక్వైరీ కింద తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు. లూప్‌లైన్‌లో అప్రధాన్య పోస్టుల్లో నియమించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటం, డబ్బులు ముట్టచెప్పడంతో ఒక ముఖ్యమైన మండలానికి తహసీల్దారుగా నియమించారు. ప్రస్తుతం అంతకంటే పోకల్‌గా గుర్తింపు ఉన్న మండలంలో ఉన్నారు.  రాజకీయ అండదండలు ఉండడంతో  కర్నూలు మండలానికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
 
పై రెండు ఉదాహరణలే కాదు..జిల్లాలో ఇలాంటివి ఎన్నో.. తెలుగుదేశం పాలనలో అవినీతి అధికారులకు అందలం వేస్తున్నారని చెప్పేందుకు నిదర్శనాలుగా నిలిచాయి. 
 
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా.. టీడీపీ నేతల సిఫార్సులతో సదరు అధికారులను కీలక పోస్టుల్లో నిమిస్తున్నారు. వారు యథావిధిగా అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా.. వారిని కీలకమైన పోస్టుల్లో నియమించరాదనే నిబంధన ఉంది. లూప్‌లైన్‌లో అప్రధాన్యపు పోస్టుల్లో నియమించాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న బదిలీల్లో ఈ నిబంధను పక్కపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు, పైరవీలు చేస్తే ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నా పోకల్‌ పోస్టులు వస్తాయి. అవినీతి కేసుల్లో చిక్కుకున్న వారు నేడు కీలక పోస్టుల్లో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏసీబీ కేసులు ఉన్న వారిని లూప్‌లైన్‌లో ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించేవారు. దీనిని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలే లంచావతారులను కీలక పోస్టుల్లో నియమించడానికి సహకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల అండదండలు లేకపోతే కీలక పోస్టులు దక్కే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. సహకరించినందుకు టీడీపీ నేతలకు కూడా భారీగా నజరానాలు ముడుతున్నట్లు స్పష్టమవుతోంది. 
 
ఇవీ ఉదాహరణలు...
- నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక యూనిట్‌లో ముఖ్యమైన పోస్టులో పనిచేస్తున్న ఆయన  కర్నూలులో ఖరీదైన కాలనీలో నివాసం ఉండే వారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై  మూడేళ్ల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆయన నివాసం, బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. తర్వాత నిబంధనల ప్రకారం ప్రాధాన్యత లేని పోస్టులో నియమించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కీలకమైన పోస్టులో నియమించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అధికార పార్టీ నేతల సిఫార్సులతో అమరావతిలో కీలకమైన కార్యాలయంలో అతి ముఖ్యమైన పోస్టులో ఇతనిని నియమించారు. 
 
- విద్యుత్‌ శాఖలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన  డివిజన్‌ ఆపరేషన్స్‌ ఆయన పనిచేస్తున్నారు. పొరుగు జిల్లాలో తొమ్మిదేళ్ల క్రితం  ఏడీఈగా పని చేస్తున్నప్పుడు ఒక డాబాకు అక్రమంగా  విద్యుత్‌ వాడుతున్నారని  కేసు నమోదు చేశారు. డాబా యజమానిపై పెట్టిన కేసు తొలగించేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  దీంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. తర్వాత  ఈయనను లూప్‌లైన్‌లో నియమించాల్సి ఉండగా.. కీలకమైన  ఆపరేషన్స్‌ డీఈగా నియమించారు. ప్రస్తుతం పోకల్‌ స్థానంలో ఆపరేషన్స్‌ డీఈగా పనిచేస్తున్నారు.  
- 2014లో కర్నూలుకు 50 కిలో దూరంలో ఒక డీలరు నుంచి  లంచం తీసుకుంటూ ముగ్గురు రెవెన్యూ అధికారులు ఏసీబీకి దొరికి పోయారు. ప్రాధాన్యాత లేని పోస్టులో నియమించాల్సి ఉండగా నంద్యాల డివిజన్‌లోని ఓ తహసీల్దారు కార్యాలయంలో కీలకమైన పోస్టులో  పనిచేస్తున్నారు.
 
 కీలక స్థానాల్లో చక్రం తిప్పుతూ..
అవినీతి కేసుల్లో ఉన్న అధికారులు మళ్లీ కీలక పోస్టులు సంపాదించి చక్రం తిప్పుతిన్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, స్టాంపులు రిజిస్ట్రేషన్‌లు, నీటిపారుదల, సర్వే సెటిల్‌మెంటు, ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగాలు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ విభాగాల్లో పనిచేస్తున్న వారే ఎక్కువగా లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు.  ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న వారికి నిర్ణీత గడువు తర్వాత మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో వీరు కీలకమైన స్థానాల్లో చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement