చిన్నారులను బలిగొన్న గుంతలు | boy and four year girl child die in jcb pit | Sakshi
Sakshi News home page

చిన్నారులను బలిగొన్న గుంతలు

Jun 7 2016 1:31 AM | Updated on Jul 12 2019 3:02 PM

చిన్నారులను బలిగొన్న గుంతలు - Sakshi

చిన్నారులను బలిగొన్న గుంతలు

ఇంకుడు గుంతే ఆ చిన్నారి పాలిట మృత్యుకుహరంగా మారింది. ఇంకుడు గుంత నిర్మాణంకోసం నాలుగు నెలల క్రితం తీసిన గుంతలో పడి చిన్నారి మృతి

గుంతలో పడి చిన్నారి మృతి
పర్వతాపూర్‌లో ఘటన

 రామాయంపేట:  ఇంకుడు గుంతే ఆ చిన్నారి పాలిట మృత్యుకుహరంగా మారింది. ఇంకుడు గుంత నిర్మాణంకోసం  నాలుగు నెలల క్రితం తీసిన గుంతలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన  సోమవారం మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో అందరిలాగే కట్ట శేఖర్ ఇంకుడు గుంత నిర్మాణం కోసం గుంత తవ్వుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వర్షానికి గుంతలో నిండుగా నీరు నిలిచింది. శేఖర్ ఇంటి మందు గుడిసెలో అతడి బావ కట్ట గోపాల్, దేవమణి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు.

వారి పెద్ద కూతురు భువనేశ్వరి (5) ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి నీటిలో మునిగిపోయింది. ఆ చిన్నారి తల్లి తన కూతురును గాలిస్తున్న క్రమంలో గుంత సమీపంలోకి వెళ్లగా, నీటిలో  వెంట్రుకలు కనిపించాయి. ఆందోళన చెందిన ఆమె నీటిలోకి దూకి కూతురును బయటకు లాగగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలిసి గ్రామస్తులు తరలివచ్చారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్ సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించి బాధితులను ఓదార్చారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం జిల్లాలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. జగదేవ్‌పూర్ మండలం చిన్నకిష్టాపూర్‌లో జేసీబీ గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. మరో ఘటనలో రామాయంపేట మండలం పర్వతాపూర్‌లో ఇంటి ముందు తీసిన ఇంకుడు గుంత బాలిక ప్రాణాలను హరించింది. గుంతలు మృత్యు కుహరాలయ్యాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులను బలిగొన్నాయి. జేసీబీ గుంతను గుర్తించక ఓ బాలుడు దానిలో పడి మృత్యువాత పడ్డాడు. మరో ఘటనలో ఇంకుడు గుంత నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి మరో చిన్నారి అసువులు బాసింది. సోమవారం చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటనలు పలువురిని కలిచివేశాయి.

 జేసీబీ గుంతలో పడి బాలుడి మృతి చిన్న కిష్టాపూర్‌లో ఘటన
జగదేవ్‌పూర్: జేసీబీ గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చిన్నకిష్టాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నూనె యాదగిరి, తేజ దంపతులకు కూతురు త్రివేణి, కొడుకు కుమార్ అలియాస్ జేమ్స్(11) ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం కుమార్ గ్రామ సమీపంలోని సంసాని కుంట దగ్గర అల్ల నేరడి పండ్ల కోసం వెళ్లి వస్తూ పక్కనున్న మరో కుంటలోకి వెళ్లాడు. కుంటలో భారీ జేసీబీ గుంతలు ఉండడం, అందులో నీళ్లు పుష్కలంగా ఉండడంతో ప్రమాదవశాత్తు కుమార్ అందులో పడిపోయాడు.

పక్కనే ఉన్న తోటి పిల్లలు చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దరి దొరకకపోవడంతో కుమార్ నీట మునిగిపోయాడు. దీంతో పిల్లలు కేకలు వేశారు. పరిసరాల్లోని వాళ్లు వచ్చి చూసే సరికే బాలుడు మృతి చెందాడు. వెంటనే గ్రామస్తులు, తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొడుకా ఆగం చేసి పోతివా అంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. అక్క త్రివేణి రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి. ఈ మేరకు కుకునూర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement