కరూర్‌ వైశ్య బ్యాంక్‌ దోపిడీకి యత్నం | bank robbery attempt | Sakshi
Sakshi News home page

కరూర్‌ వైశ్య బ్యాంక్‌ దోపిడీకి యత్నం

Jul 24 2017 12:10 AM | Updated on Aug 30 2018 5:27 PM

కరూర్‌ వైశ్య బ్యాంక్‌ దోపిడీకి యత్నం - Sakshi

కరూర్‌ వైశ్య బ్యాంక్‌ దోపిడీకి యత్నం

నగరంలోని గౌలి వీధిలో.. పాత కంట్రోల్‌ రూం సమీపంలో ఉన్న కరూర్‌ వైశ్య బ్యాంక్‌లో శనివారం అర్ధారాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు.

 - కిటికీ ఊచలను కోసి లోపలికి ప్రవేశంచిన దుండగులు
- సీసీ కెమెరాల కేబుల్‌ వైర్లను కట్‌ చేసిన వైనం
- స్ట్రాంగ్‌ రూం లోకి వెళ్లగానే మోగిన సైరన్‌..పరారైన దొంగలు
- సెక్యూరిటీ గార్డు వ్యవహారంపై అనుమానం
 
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) : నగరంలోని గౌలి వీధిలో.. పాత కంట్రోల్‌ రూం సమీపంలో ఉన్న కరూర్‌ వైశ్య బ్యాంక్‌లో శనివారం అర్ధారాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్‌కు కూత వేటు దూరంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీ బంగ్లాలు, కార్యాలయాలు, రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఉన్నాయి. ఆ దారి భద్రతా వలయంలో ఉన్న వీధిలో బ్యాంక్‌ దోపిడీకి యత్నించడం సంచలనం రేపింది.
 
పక్కా ప్రణాళికతోనే..
కరూర్‌ వైశ్య బ్యాంకులో ఆరుగురు సభ్యులు ఉన్నా దొంగల ముఠా పక్కా ప్రణాళికతో దోపిడికీ యత్నించినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకుకు ఎడమ పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేవనే విషయాన్ని గమనించి అటువైపు ఉన్న కిటికీ నుంచి లోపలికి ప్రవేశించాలని పథకాన్ని రచించినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి రెండు గంటల మధ్య కిటికీ గ్రిల్‌ను హాక్సా బ్లేడ్‌లతో కట్‌ చేసి ఇద్దరు బ్యాంకులోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేశారు.  అలారం వైర్లను కట్‌ చేసేందుకు సర్వర్‌ రూంలో పవర్‌ను నిలిపివేసేందుకు చాలా వైర్లను కట్‌ చేశారు. అలారం సైరన్‌ మోగదనుకొని స్ట్రాంగ్‌ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఉదయం 6.55 గంటలైంది. ఆ సమయంలో స్ట్రాంగ్‌ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సైరన్‌ మోగిడంతో పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా, సైరన్‌ మోగిన వెంటనే సెక్యూరిటీ గార్డు షాలిసాహెబ్‌ అప్రమత్తమై బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పార్థసారథికి ఫోన్‌ చేశారు. ఆయన మేనేజర్‌ రవితేజకు తెలియజేయడంతో వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బ్యాంకులో విలువైన పత్రాలు, డబ్బులు దొంగతనానికి గురికాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. 
 
సెక్యూరిటీ గార్డు వ్యవహారంపై అనుమానం...
సెక్యూరిటీ గార్డు షాలిసాహెబ్‌ రాత్రి పూట మేల్కొనాల్సి ఉండగా ఒంటి గంట సమయంలో పడుకున్నానని చెబుతున్నాడు.  బ్యాంకు కిటికీ గ్రిల్‌ను కోస్తున్నా, లోపలికి వెళ్లి వైర్లను కట్‌ చేస్తున్నా అతనికి స్పృహ లేకపోవడం గమనార్హం. ఉదయం 5.30 –6 గంటల మధ్య లేచి బ్యాంక్‌ లోపల కొంత ప్రదేశం శుభ్రం చేసి బయట కూర్చున్నానని అధికారులకు చెప్పాడు. 6.55 గంటలకు అలారం మోగడంతో వెంటనే చుట్టుపక్కల పరిశీలించినా ఎవరూ కనిపించలేదనడం, గ్రిల్‌ నుంచి దొంగలు బయటకు వచ్చేది తను చూడలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాల పరిశీలిన :
విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు వెంటనే డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో దొంగలు డ్రిల్‌ మిషన్‌ కిట్‌తో పాటు గడ్డపార, పెరుగన్నం, రెండు బిస్కెట్‌ ప్యాకెట్లు, రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిశితంగా పరిశీలించిన కుక్కలు యూకాన్‌ ప్లాజా వరకు వెళ్లాయి. క్లూస్‌ టీం కూడా కొన్ని ఆధారాలను సేకరించింది. 
 
ప్రొఫెషనల్స్‌ పనే : 
 దోపిడీ యత్నంలో ఆరుగురు ప్రొఫెషనల్స్‌ పాల్గొన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు దోపిడీల్లో వారికి అనుభవం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లోపలికి ప్రవేశించడం.. నుంచి సీసీ కెమెరాలు, సైరన్‌ వైర్లను కట్‌ చేయడం, పవర్‌ను డిస్‌కనెక్ట్‌ చేసిన తీరు అందుకు నిదర్శనం. అంతేగాక కిటికీలు, తలుపులు, వైర్లు, లాకర్లు, స్ట్రాంగ్‌ రూంలను కట్‌ చేయడం, పగలగొట్టడానికి అత్యాధునిక డ్రిల్‌ మిషన్లు, కటింగ్‌ బ్లేడ్‌లతో కూడిన కిట్‌ను వాడారని ఆధారాలను బట్టి అర్థమవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement