ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నిస్తున్న కార్మికుడు ముబారక్
మున్సిపల్ చైర్మన్ వైఖరితో విసిగెత్తిన కార్మికుడు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన బుధవారం జరిగింది. విధులలో నుంచి తొలగించారనే మనస్తాపంతో కార్యాలయ ఆవరణలోని ఓవర్‌హెడ్ నీటిట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు.
– చైర్మన్ వైఖరితో మనస్తాపం
– ట్యాంకు ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపు
– రెండు గంటల సేపు ఉత్కంఠ
మదనపల్లె:
మున్సిపల్ చైర్మన్ వైఖరితో విసిగెత్తిన కార్మికుడు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన బుధవారం జరిగింది. విధులలో నుంచి తొలగించారనే మనస్తాపంతో కార్యాలయ ఆవరణలోని ఓవర్‌హెడ్ నీటిట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. సుమారు రెండుగంటల పాటు అధికారులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేశాడు. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ముబారక్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్ల నుంచి ఆటోడ్రై వర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రతిరోజూ కంపోస్టుయార్డుకు తరలించడం అతని విధి. ఈ క్రమంలో మూడురోజుల క్రితం కంపోస్టుయార్డులో సిబ్బంది మధ్య జరిగిన వాదులాటలో ముబారక్ ప్రవర్తనపై చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ముబారక్‌ను విధులలో నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో మనస్తాపానికి గురైన ముబారక్ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. తన ఉద్యోగం తనకు ఇస్తేనే దిగుతానంటూ, చైర్మన్, కమిషనర్‌లు వచ్చి మాట ఇస్తేనే దిగుతానని భీష్మించుకుని కూర్చున్నాడు. చైర్మన్ వైఖరితో ఇప్పటికే ఓ కార్మికుడు తనువు చాలించాడని, కనీసం నా చావుతోనైనా ఆయనలో మార్పు రావాలని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ నిరంజన్‌కుమార్, ఎసై ్స సుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుడిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ మహిళావిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్ ముక్తియార్ ఖాన్, బాబునాయుడు, సుమంత్‌కల్యాణ్‌లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. షమీం అస్లాం ఏకంగా ట్యాంకుపైకి ఎక్కి ముబారక్‌తో చర్చలు జరిపారు. చైర్మన్ వస్తేగానీ తన నిర్ణయం మార్చుకోనని చెప్పడంతో ఆమె చొరవ చూపి చైర్మన్, కమిషనర్‌లను పిలిపించారు. ఉద్యోగం నుంచి తొలగించలేదని, నీ విధులు నీవు చేసుకోవచ్చంటూ చైర్మన్, కమిషనర్‌లు హామీ ఇవ్వడంతో ముబారక్ కిందకు దిగేందుకు అంగీకరించాడు. రెండు గంటల పాటు ఎత్తులో నిలబడటంతో నీరసించిన ముబారక్‌ను సీఐ నిరంజన్‌కుమార్ చొరవ తీసుకుని స్వయంగా పైకి ఎక్కి కిందకు తీసుకువచ్చారు.