
ఏపీ లెక్కలన్నీ తప్పులే!
ష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న లెక్కలన్నీ తప్పేనని కృష్ణా బోర్డుకు తెలంగాణ మరోమారు తేల్చిచెప్పింది.
- కృష్ణా బోర్డుకు స్పష్టం చేసిన తెలంగాణ
- ప్రకాశం బ్యారేజీ దిగువనే ఏపీ వినియోగం 124 టీఎంసీలు.. చెబుతోంది 104 టీఎంసీలే
- మిగతా చోట్లా తమ వినియోగాన్ని తక్కువగా చూపుతోంది
- అదే సమయంలో తెలంగాణ ఎక్కువగా వాడుకున్నట్లు ఆరోపిస్తోందని వివరణ
- తెలంగాణకు 50 టీఎంసీలు కేటాయించాల్సిందేనని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న లెక్కలన్నీ తప్పేనని కృష్ణా బోర్డుకు తెలంగాణ మరోమారు తేల్చిచెప్పింది. ఏపీ వినియోగానికి, బోర్డుకు చూపుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేదని స్పష్టం చేసింది. గురువారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో భేటీ సందర్భంగా తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ వాస్తవ లెక్కలను స్పష్టంగా వివరించారు. ఏపీ చేస్తున్న మొండి వాదనను తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ తన వినియోగాన్ని 104 టీఎంసీలుగా చూపుతోంది. కానీ వాస్తవానికి పులిచింతల నుంచి 103 టీఎంసీలు, మున్నేరు పరీవాహకం నుంచి 34 టీఎం సీలు, పట్టిసీమ నుంచి 48.53 టీఎంసీల మేర వినియోగించుకుంది. మొత్తంగా 186 టీఎంసీల లభ్యత నీటిలో 55.5 టీఎంసీలు సముద్రంలో కలవగా... మిగిలిన నీరు 131 టీఎంసీల మేర ఉంటుంది. అందులో సహజ నష్టాల కిం ద 6 నుంచి 7 టీఎంసీల మేర తీసేసినా.. 124 టీఎంసీల వినియోగం జరిగింది. అంటే ఇక్కడే ఏపీ 20 టీఎంసీల మేర తక్కువగా చూపుతోంది..’’ అని మురళీధర్ వివరించారు.
మైనర్ ఇరిగేషన్‌లోనూ..
ఇక చిన్న నీటిపారుదల కింద వినియోగం లెక్కలను కూడా కృష్ణా బోర్డుకు మురళీధర్ వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ గత పదేళ్లుగా వినియోగించుకున్న నీరు 36 టీఎంసీలను దాటలేదని.. అలాంటప్పుడు ఈ సారి 89.15 టీఎంసీలు వినియోగించిదన్న ఏపీ వాదనలో అర్థం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తంగా 32 టీఎంసీల మేర మా త్రమే వినియోగం జరిగిందని.. అందులోనూ భారీ ప్రాజెక్టుల నుంచి వచ్చిన 7 టీఎంసీల నీటితోనే చెరువులు నింపారని, మరో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ కింద తీసేస్తే తెలంగాణ వినియోగం 20 టీఎంసీలు దాటలేదని వివరించారు. కాగా తెలంగాణకు ప్రస్తుత రబీ అవసరాలు, తాగునీటి కోసం లభ్యత నీటిలోంచి 50 టీఎంసీలు కేటాయించాల్సిందేనని తేల్చిచెప్పారు. అయితే దీనిపై బోర్డు సభ్య కార్యదర్శి ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. ఏపీతో మరోమారు చర్చించాక తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.