
వెనక్కి వచ్చేశారు
దుబాయ్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాద ఘటన ప్రభావం ప్రయాణికులపై చూపింది.
షార్జా విమానాశ్రయంలోఅనుమతించకపోవడంతో ప్రయాణికులు వెనక్కి
దుబాయ్ విమానాశ్రయంలో ఘటనే కారణం
సాంకేతిక కారణాలతో పలు విమానాల రద్దు...ఆలస్యం
గోపాలపట్నం : దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాద ఘటన ప్రభావం ప్రయాణికులపై చూపింది. దుబాయ్ విమానాశ్రయంలో రనవ్‌వే దెబ్బతినడంతో విమానాశ్రయం తాత్కాలికంగా బంద్ అయింది. దీంతో షార్జాకి విమానప్రయాణాలు జరపడానికి ఎయిరిండియా టికెట్లిచ్చింది.
గురువారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో దుబాయ్ ప్రయాణికులతో షార్జాకి బయల్దేరిన విమానానికి హైదరాబాదు విమానాశ్రయంలో అంతరాయం ఏర్పడింది. షార్జా విమానాశ్రయంలో వాలడానికి పచ్చజెండా ఊపలేదు. అక్కడ రన్‌వే ఖాళీగా లేదన్న సంకేతాలు రావడంతో హైదరాబాదులో ప్రయాణికులు నిలిచిపోయారు. కొందరు అక్కడి నుంచి ప్రత్యామ్నాయ విమానాల్లో అత్యవర ప్రయాణాలు సాగించారు.
మరో డెభ్భైమంది మాత్రం ఆందోళన వెలిబుచ్చారు. దీంతో ఆవిమాన సంస్థ శుక్రవారం ఉదయం వారిని విశాఖకు తిరిగి తీసుకొచ్చేసింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఎయిరిండియా విమాన సంస్థ షార్జా విమానాశ్రయంలో క్లియరెన్స్ తెచ్చుకోవడంతో ఆలస్యంగానయినా విమానం వచ్చింది. ఉదయం ఏడున్నరకి రావాల్సిన విమానం 10.30కి వచ్చింది. తిరిగి 10.50కి ఢిల్లీ బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 01.30కి బయలుదేరి వెళ్లింది.
ఇదిలా ఉండగా, చెన్నై నుంచి విశాఖకు మధ్యాహ్నం 02.05కి రావాల్సిన విమానం సాయంత్రం 06.15కి విశాఖకు చేరింది. ఇది తిరిగి 03.55కి వెళ్లాల్సిన విమానం రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరింది. ఎయిర్‌కోస్తా విమాన సర్వీసు పలు కారణాల వల్ల రద్దయింది. దీంతో బెంగుళూరు-విశాఖ, హైదరాబాద్-విశాఖ, విశాఖ-బెంగళూరు సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసుల అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.