విగ్రహ తొలగింపుపై రాస్తారోకో | Sakshi
Sakshi News home page

విగ్రహ తొలగింపుపై రాస్తారోకో

Published Fri, Aug 19 2016 8:32 PM

విగ్రహ తొలగింపుపై రాస్తారోకో

రావిపాడు రోడ్డులో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆందోళన
 
నరసరావుపేట రూరల్‌ : ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డులోని ఆలయం ఎదుట శుక్రవారం రాస్తారోకో చేశారు. రావిపాడు రోడ్డులోని కమ్మ హాస్టల్‌ సమీపంలో ఆంజనేయస్వామి వారి చిన్న ఆలయాన్ని నిర్మించి కొన్నేళ్ళుగా పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ విగ్రహాన్ని రెండు ముక్కలుగా చేసి మురుగు కాల్వలో పడేశారు. అలాగే, రెండు నెలల క్రితం కూడా పట్టణంలోని రెడ్డి కళాశాల ఎదుట ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. వరసగా విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతుండటంతో వీహెచ్‌పీ ఆందోళనకు దిగింది. విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ, భజరంగ్‌దళ్, హిందూ సేన తదితర సంస్థల ఆధ్వర్యంలో దాదాపు గంటపాటు రాస్తోరోకో చేశారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి చలవాది రాధాకృష్ణమూర్తి, హిందూసేన నాయకులు కోట ప్రసాద్, భజరంగ్‌దళ్‌ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ ప్రహ్లాదగుప్తా, బీజేపీ నాయకులు వల్లెపు కృపారావు, కాకుమాను కోటేశ్వరరావు, సీహెచ్‌ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
Advertisement