అనుమతి లేకుండా పాఠశాలలో తన తండ్రి విగ్రహం ఏర్పాటు
చిత్తూరు: టీడీపీ నేత అత్యుత్సాహం ప్రదర్శించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని కొళత్తూరు జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన స్టేజీని శనివారం ప్రారంభించాడు. దీంతో పాటు అదే స్టేజీ మీద తన తండ్రి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడు. అయితే గ్రామస్తులు, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల ప్రాంగణంలోని స్టేజీ మీద తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేశాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారని హెచ్‌ఎంను నిలదీశారు. పాఠశాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా టీడీపీ నాయకుడు తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. పీఎస్సై మారప్ప గ్రామానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. దీనిపై ఎంఈఓ గోపాల్‌రెడ్డిని వివరణ కోరగా హెచ్‌ఎం నివేదికను, పాఠశాల ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.


