
ఎస్ఐపై చర్యలు తీసుకోండి
నేను ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధిని. ఒక కుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిని.
- ఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి ఓ ఎంపీటీసీ ఆందోళన
అనంతపురం టౌన్ : ‘నేను ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధిని. ఒక కుల సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. ఈ విషయం చెప్పినా నాలుగో పట్టణ ఎస్‌ఐ జీటీ నాయుడు పట్టించుకోలేదు. దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఖాకీ దుస్తులేసుకున్నంత మాత్రాన ప్రజలు చూస్తుండగా విచక్షణరహితంగా రెచ్చిపోవచ్చా? అదేం ప్రజాస్వామ్యం’ అంటూ ఎ.నారాయణపురం–3 ఎంపీటీసీ సభ్యుడు, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోమవారం (ఆగస్టు 15న) ఉదయం 8 గంటలకు నారాయణపురం గ్రామంలో జెండా పండుగ నిర్వహించేందుకు వెళ్తుండగా మంగమ్మ అవ్వ ఆశ్రమం సమీపంలో ఎస్‌ఐ జీటీ నాయుడు జీపులో ఎదురుగా వచ్చి నానా హంగామా చేశారని ఆరోపించారు. తాను ఫలానా వ్యక్తిని అని చెప్పినా పట్టించుకోకుండా అందరి ముందు చెంపపై కొట్టడమే కాకుండా ఎన్‌కౌంటర్ చేస్తా అంటూ బెదిరించారన్నారు. స్థానికులు వారించినా పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్ర వేడుకల వేళ ప్రజాప్రతినిధినైన తనకు అవమానం జరిగిందని, తక్షణం ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో జీటీ నాయుడు నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని విన్నవించారు.