ప్రేమిస్తున్నాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..నమ్మి ఆ యువతి అతడి వలలో చిక్కింది..
పలివెల (మునుగోడు)
ప్రేమిస్తున్నాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు..నమ్మి ఆ యువతి అతడి వలలో చిక్కింది.. ఇంకేముంది ఆరు నెలలుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. పెళ్లి చేసుకోవాలని కోరితే ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో ఆ యువతి న్యాయం చేయాలని కోరుతూ ఆయువతి బుధవారం ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.... మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పోడపంగి నిరంజన్ ప్రేమిస్తున్నాని అదే గ్రామానికి చెందిన గోసుకొండ దీప వెంట పడ్డాడు. మెుదట్లో నిరాకరించినా అతడి మాయమాటలకు మోసపోయింది. దీంతో గత వారం రోజుల వరకు సినిమాలు, షికార్లకు తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని దీప నిలదీయడంతో నిరాకరించాడు. దీంతో దీప పెద్దలను ఆశ్రయించగా పెళ్లి చేసుకోవాలని తీర్మానించారు. కానీ నిరంజన్ తనకు సంబంధం లేదంటూ తేల్చిచెప్పాడు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు కలిసి దీపను నిరంజన్ ఇంటి వద్ద విడిచి వెళ్లారు. తనకు న్యాయం చేయాలని దీప వేడుకుంటోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.