
స్నేహితులతో కలిసి బాగారెడ్డి స్టేడియం సందర్శన
ప్రముఖ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు బుధవారం జహీరాబాద్‌లో సందడి చేశారు.
జహీరాబాద్:ప్రముఖ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు బుధవారం జహీరాబాద్‌లో సందడి చేశారు. సాయంత్రం ఆయన స్థానిక బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తూ జహీరాబాద్‌లో తన మిత్రుడు, మాజీ కౌన్సిలర్ కె.సునీల్‌కుమార్ ఇంటివద్ద కొద్దిసేపు ఆగారు. అనంతరం స్టేడియానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పలువురు యువకులు అతనితో మాట్లాడేందుకు ఆసక్తికనబరిచారు. మొదట్లో ఆయన జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియాన్ని సందర్శించారు. ఆ తరువాతే భారత జట్టులో స్థానం పొందాడు.
గతంలో అర్షద్ అయూబ్, వెంకటపతి రాజులు సైతం జహీరాబాద్ స్టేడియాన్ని సందర్శించిన తరువాతే జాతీయ జట్టులో స్థానం లభించిందని చెబుతారు. ఇదే సెంటిమెంటును నమ్మే అంబటి రాయుడు తాజాగా మరోమారు ఈ స్టేడియానికి వచ్చారు. మళ్లీ జట్టులో స్థానం పొందాలనే ఉద్దేశంతో ఈ మైదానానికి వచ్చినట్టు అతని మిత్రులు తెలిపారు. జాడీ మల్కాపూర్‌లోని జలపాతాన్ని కూడా పలుమార్లు సందర్శించారని, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి వచ్చారని వారు పేర్కొన్నారు.