
అయ్యో పాపం.. లక్ష్మి
ఓ వృద్ధుడు విషమ పరీక్షను ఎదుర్కొన్నాడు. తనను పోషించే కూతురు తన ఒడిలోనే ప్రాణాలు వదలడంతో తట్టుకోలేకపోయాడు.
- బస్టాండ్‌లో తండ్రి ఒడిలో తనువు చాలించిన కూతురు
- శవాన్ని ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక తల్లడిల్లిన తండ్రి
- మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదకర ఘటన
నర్సాపూర్ రూరల్: ఓ వృద్ధుడు విషమ పరీక్షను ఎదుర్కొన్నాడు. తనను పోషించే కూతురు తన ఒడిలోనే ప్రాణాలు వదలడంతో తట్టుకోలేకపోయాడు. బస్టాండ్‌లో ఉండగానే ఈ ఘటన జరిగింది. శవాన్ని ఇంటికి తీసుకెళ్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేక బోరుమన్నాడు. గ్రామస్తులకు, బంధువులకు సమాచారమిచ్చినా ఎవరూ రాకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ఆటో సమకూర్చడంతో ఎట్టకేలకు పుట్టెడు దుఃఖంతో బిడ్డ శవాన్ని తీసుకొని ఇంటిముఖం పట్టాడు. ఈ విషాదకరమైన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన ఎల్లయ్యకు కొడుకులు లేరు. కూతురు లక్ష్మికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు.
అల్లుడు పాపయ్య రెండేళ్ల క్రితం మరణించాడు. ఎల్లయ్యకు కూతురు లక్ష్మి ఆసరాగా నిలిచింది. లక్ష్మి (32) పొట్టకూటి కోసం ఉపాధి హామీలో కూలీ పనులకు వెళ్లింది. వడదెబ్బ తగిలి బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. కూతురిని బస్సులో నర్సాపూర్‌కు తీసుకొచ్చాడు. ఆపై ప్రభుత్వాసుపత్రిలో చూపించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి లేదా హైదరాబాద్‌లోని గాంధీకి తీసుకువెళ్లాలని సూచించగా తిరిగి నర్సాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ ఆయన ఒడిలోనే కూతురు లక్ష్మి ప్రాణాలు విడిచింది. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకుపోదామన్నా చిల్లిగవ్వ లేక బస్టాండ్‌లోనే బోరుమన్నాడు.
అతని పరిస్థితి చూసిన అక్కడున్న వారు సైతం కంటతడి పెట్టారు. ఎవరికి తోచిన విధంగా వారు చిల్లర డబ్బులు ఇచ్చారు. ఎల్లయ్య ఇతరుల ఫోన్ ద్వారా గ్రామస్తులకు, బంధువులకు సమాచారమిచ్చి రెండుగంటలు నిరీక్షించినా ఎవరూ రాలేదు. చీకటిపడ్డాక స్థానికులు కొంతమంది ఓ ఆటోను ఏర్పాటు చేసి లక్ష్మి శవాన్ని వారి స్వగ్రామానికి పంపిం చారు. తనను పోషించే కూతురు మరణించడంతో తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.