ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో శ్రీహేవళంబి నామ ఉగాది ఉత్సవాలు డల్లాస్లో ఘనంగా జరిగాయి.
డల్లాస్
ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో శ్రీహేవళంబి నామ ఉగాది ఉత్సవాలు డల్లాస్లో ఘనంగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త పాలేటి లక్ష్మి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయ కర్త తోటపద్మశ్రీ పర్యవేక్షణలో ఈ ఉగాది ఉత్సవాలలో ఏర్పాటు చేసిన విభిన్నకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ ఉగాది ఉత్సవాలకు సుమారు1100మందికి పైగా తెలుగు వారు హాజరు కాగా సుమారు 250మంది పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సందడిచేశారు. అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, 'ఏకదంతాయ వక్రతుండాయ' అంటూ వివిధ సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ కొనసాగాయి.
భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోమలి సోదరీమణులు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ, చక్కటిమాటలతో, మిమిక్రీ ప్రదర్శనలతో ప్రేక్షకులందరిని ఎంతో ఆనందపరిచారు. సంప్రదాయమైన నృత్యాలతోపాటు, సినిమాపాటలు వీక్షకులను అలరించాయి. ఉగాది సందర్భంగా కంటంరాజు సాయికృష్ణ పంచాంగ శ్రవణం వినిపించారు.
ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్2017 ’ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం వైద్య, తెలుగుభాషాభివృద్ది, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. వైద్యరంగంలో డా.గునుకుల శ్రీనివాస్, తెలుగుభాషాభివృద్ది రంగంలో కే.సి. చేకూరి, విద్యారంగంలో డా. పుప్పాల ఆనంద్లకు ఈ పురస్కారాలను అందజేశారు. అదే విధంగా సంస్థ వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న దివాకర్ మల్లిక్, డా. కలవగుంటసుధ, మార్పాక పరిమళ, తుమ్మల జస్మిత, నిడిగంటి ఉదయ్లను‘ఉత్తమస్వచ్ఛందసేవకుడు (బెస్ట్ వాలంటీర్)’పురస్కారంతోసత్కరించారు.
అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిథికళాకారులైన మెజీషియన్ వసంత్, గాయకుడు కూరపాటి సందీప్, కోమలి సోదరీమణులను టాంటెక్స్ కార్యవర్గ బృందంజ్ఞాపికలతో సత్కరించారు. సంస్థ రేడియో కార్యక్రమాలకు 2016 సంవత్సరంలో వ్యాఖ్యాతలుగా స్వచ్ఛందంగా సేవలందించిన వారికి జ్ఞాపికలను అందించారు.
ఈ ఉగాదికార్యక్రమం విజయవంతం కావడంతో కృసి చేసిన ఎన్ఎస్ఐ సంస్థ, రాం కొనార, పోలవరపు శ్రీకాంత్, రిచ్మండ్ హిల్ మోంటెస్సోరి సంస్థ, ప్రాడిజీ టెక్నాలజీస్, వీర్నపు చిన సత్యంలకు టాంటెక్స్ కృతఙ్ఞతలు తెలిపింది.