జెడ్పీ చైర్‌పర్సన్‌ సీసీ ఆత్మహత్యాయత్నం!

ZP Chairperson CC Comits Suicide Attempt in Srikakulam - Sakshi

సీఈవో,ఉద్యోగుల సంఘ నేతల వేధింపులేకారణమంటూ నోట్‌ విడుదల

విలేకరుల ఎదుటే ఫినాయిల్‌ తాగిన సంతోష్‌

శ్రీకాకుళం, అరసవల్లి: ‘పదోన్నతితో పాటు సర్వీసు రెగ్యులర్‌ చేసే విషయంలో జెడ్పీ సీఈఓ బి.నగేష్, పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు డి.అప్పన్నలు మూడేళ్లుగా తనను మానసికంగా వేధిస్తున్నారని, కక్ష సాధిస్తున్నారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ జిల్లా పరిషత్‌ ఉద్యోగి మాసపు సంతోష్‌కుమార్‌ మంగళవారం ఆత్మహత్యాయత్నానికిపాల్పడ్డాడు. తన చావుకు వారే కారణమంటూ విలేకరుల ఎదుట జిల్లా పరిషత్‌ కార్యాలయంలోనే ప్రమాదకర ఫినాయిల్‌ను తాగేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మికి క్యాంపు క్లర్క్‌ (సి.సి)గా పనిచేస్తున్న సంతోష్‌ మంగళవారం ఉదయం విలేకరుల సమక్షంలో తన ఆవేదనను వెల్లగక్కాడు.

తనకు సీనియర్‌ అసిస్టెంట్‌గా కండీషనల్‌గా పదోన్నతి ఇచ్చారని, దీన్ని రెగ్యులర్‌ చేయాలని సీఈఓను ఎన్నోసార్లు కోరానని చెప్పాడు.  కుటుంబ       కలహాల కేసు కారణంగా అమలైన తన సస్పెన్షన్‌ కాలాన్ని రెగ్యులర్‌ చేసి, ఇంక్రిమెంట్లు మంజూరు చేసే విషయంలోనూ సీఈఓ, యూనియన్‌ నేతలు వేధించారని వాపోయాడు. ఆఖరికి అనిల్‌ అనే క్లాస్‌–4 ఉద్యోగితో తనపై అట్రాసిటీ కేసును కూడా బనాయించేలా కుట్ర పన్నారని ఆధారాలతో వివరించాడు. తనకు జరిగిన అన్యాయంపై సూసైడ్‌ నోట్‌నే ఫిర్యాదుగా తీసుకుని కలెక్టర్, ఎస్పీలు న్యాయం చేయాలని చెబుతూ ఒక్కసారిగా ఫినాయిల్‌ను తాగేశాడు. దీంతో తోటి ఉద్యోగులంతా ఆందోళనకు గురై వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

నిబంధనల ప్రకారమే..
చైర్‌పర్సన్‌ సీసీగా పనిచేస్తున్న సంతోష్‌ పదోన్నతి విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను. ఇందులో ఎటువంటి కక్ష సాధింపులు లేవు. ఇప్పటికే ఆయనకు సీనియర్‌ అసిస్టెంట్‌గా తాత్కాలిక పదోన్నతి ఇచ్చాం. రెగ్యులర్‌ చేయడానికి కోర్డు కేసులుండడంతో కొంత సమయం పడుతుంది. ఆయన చైర్‌పర్సన్‌ వద్ద పనిచేస్తున్నాడు..! విధివిధానాలు ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top