ప్రేమించిన యువతి బంధువులే హత్య చేశారు | Young Man Suspicious death In East Godavari | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Aug 16 2018 2:58 PM | Updated on Aug 16 2018 2:58 PM

Young Man Suspicious death In East Godavari - Sakshi

రైల్వే ట్రాక్‌ పై అనుమానాస్పదంగా మృతి చెందిన అరుణ్‌ కుమార్‌

మృతుడి బంధువుల ఆందోళన

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: యువకుడు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్‌పై మృతి చెందిన ఘటనపై రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. ఆల్‌కట్‌ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్‌ కుమార్‌(22) రాజమహేంద్రవరం బాలాజీ పేట రైల్వే ట్రాక్‌ పై అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడు ఆల్‌కట్‌ తోట ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండగా.. నాలుగు నెలల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఆ సమయంలో యువకుడిని చంపుతామని బెదిరించిన యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హతమార్చి రైల్వే ట్రాక్‌పై పడేశారని యువకుడి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. అరుణ్‌ కుమార్‌ తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో తల్లి జీవీకే విద్యుత్‌ ప్లాంట్‌లో కేటరింగ్‌ పని చేస్తూ తన ముగ్గురి పిల్లల్ని పోషిస్తోంది. మృతి చెందిన అరుణ్‌ కుమార్‌ రెండో వాడు కాగా, అతడు టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరూ సెంటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతదేహం, తలపైన మూడు చోట్ల గాయాలుండడం, అలాగే నొసటి పైనా గాయం ఉండడం, కాలిపై నుంచి రైలు చక్రం ఎక్కి నుజ్జునుజ్జుకావడంతో బంధువులు ఆ యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆల్‌కట్‌ తోటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. జీఆర్‌పీ ఎస్సై సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమారుడి మృతితో తల్లడిల్లుతున్న తల్లి
ఎదిగి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో మృతుడి తల్లి, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement