
విలపిస్తున్న మృతుడి బంధువులు (ఇన్‌సెట్‌లో) దర్శన్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : బైక్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైన సంఘటన నెలమంగల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడిని మాదావర గ్రామానికి చెందిన దర్శన్ (20)గా, క్షతగాత్రుడని అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (19)గా గుర్తించారు. ఇద్దరూ గురువారం ఉదయం బైక్‌పై జిమ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా 4వ జాతీయ రహదారి మార్గంలోని మాదావర సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్శన్ ఘటనాస్థలంలోనే మృతి చెందగా ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని బెంగళూరు నిమాన్స్‌కు తరలించారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీతో పాటు పరారయ్యాడు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.