
సిద్ధేశ్వరరావు
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): మండలం అడుగులుపుట్టు పంచాయతీ తమరడ గ్రామ సమీపంలో మంగళవారం ఆటోబోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామానికి చెందిన బొండా శివశంకర్‌వర ప్రసాద్ వివాహం ఈ నెల 24న జరగనుంది. ఆ వివాహానికి సంబంధించిన కార్డులను అతని తమ్ముడు బొండా సిద్ధేశ్వరరావు(17) ముంచంగిపుట్టు మండలంలో పలు గ్రామాల్లో పంచేందుకు సోమవారం తన సొంత ఆటోలో వెళ్లాడు.
అడుగుల పట్టులో జాతర చూసుకుని మంగళవారం ఆటో డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న వ్యాన్ తప్పించే క్రమంలో ఆటోబోల్తాపడింది.దీంతో సిద్ధేశ్వరరావు కిందిపడిపోయాడు. అతని గుండె ఆటో పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటా హుటినా పెదబయలు పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. సొంత ఆటో కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.