గేదె మృతి : యువకుడి ఆత్మహత్య

Young Man Committed Suicide - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: పాలిచ్చే గేదె కరెంట్‌ షాక్‌తో మృతి చెందింది. దాన్ని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు మండలంలోని లక్డారం గ్రామానికి చెందిన పాశం విజయ్‌ కుమార్‌(21) ఐదు ఆవులు, ఐదు పాడి గేదెలు మేపుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఆవులను, గేదెలను మేత కోసం రుద్రారం గ్రామ శివారులోని రాంనగర్‌ ప్రాంతంలోని సాయిపార్థ వెంచర్‌ భూముల వద్దకు తోలుకువెళ్లాడు. అక్కడ తెగిపడిన విద్యుత్‌ వైర్‌ గేదెకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో విజయ్‌ కుమార్‌ తన అన్నయ్య అనిల్‌ కుమార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న అనిల్‌ గేదె మృతి విషయంలో దిగులు పడకు అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రాత్రి విజయ్‌కుమార్‌ ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా లాభం లేకపోయింది.

దీంతో శుక్రవారం ఉదయం సాయిపార్థ వెంచర్‌కు వెళ్లి చూడగా విజయ్‌కుమార్‌ అక్కడ ఓ చెట్టుకు తన వద్ద ఉన్న టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాలు ఇచ్చే గేదె మృతి చెందిందనే మనస్తాపంతో విజయ్‌ కుమార్‌(21) ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడని అతడి అన్నయ్య అనిల్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top