
గుంటూరు, నాదెండ్ల (చిలకలూరిపేట) : గణపవరం గ్రామంలోని ఒక నూలు పరిశ్రమలోని క్వార్టర్స్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా ఫ్యాన్ ఒగ్గెకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై కె.చంద్రశేఖర్ చెప్పిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జెటి అహల్య(23) తన అక్కా, బావతో కలిసి స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటుంది. ముగ్గురు కలిసి ప్రతిరోజు కూలి పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట అక్కా, బావలు దసరా పురస్కరించుకుని స్వగ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులు ఒడిశాలో ఉంటూ ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుతుంటారు.
అహల్య ప్రవర్తనపై తల్లిదండ్రులు రోజు కోపంగా ఉంటుంటారని తోటి కార్మికులు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం నుంచి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న గది తలుపులు ఎంత సేపటికీ తెరవకపోవడంతో పక్కనే నివాసం ఉండే వాళ్లు క్వార్టర్స్ ఇంచార్జి సాంబశివరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తలుపులు తీయగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించడంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే మృతురాలి వద్ద చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ ఒడిశా భాషలో ఉండటంతో పోలీసులు దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.