కొడుకు కోసమే కడతేర్చాడు!

yoga guru murder case revealed - Sakshi

యోగా గురువు హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

కీలక సూత్రధారి జనగోల పత్రిక ఎడిటర్‌ కిలపర్తి వెంకటరమణ

సుపారీ చెల్లింపులో తేడా రావడంతో శనివారం అర్థరాత్రి కిలపర్తిపై దాడి

మర్రిపాలెం(విశాఖ ఉత్తర): కొడుకు కోసం ఓ తండ్రి హంతకునిగా మారిన ఉదంతమిది. పుత్రుని ఎదుగుదలకు పోటీగా మారుతాడని భావించి స్నేహితుడిని అంతమొందించాడు. అందుకోసం రచించిన వ్యూహంలో భాగంగా రాజీ కోసం యోగా గురువు ఇంటికి వెళ్లాడు. అన్నీ మరిచిపోయి స్నేహితులుగా ఉందామంటూ దస్తావేజుపై  రాయించుకుని సంతకాలు చేయించుకున్నాడు. అనంతరం నమ్మకంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే ఒప్పందం చేసుకున్న కిరాయి వ్యక్తులతో దాడి చేయించి క్రూరంగా హతమార్చాడు. ఇదీ యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ హత్యకు ముందు జనగోల పత్రిక ఎడిటర్‌ కిలపర్తి వెంకటరమణ వ్యవహరించిన తీరు. వియత్నాంలో యోగా గురువుగా ఉన్న కుమారుని ఎదుగుదలకు పోటీ లేకుండా చేయడం కోసం జనగోల పత్రిక ఎడిటర్‌ కిలపర్తి వెంకటరమణ ఈ హత్యకు వ్యూహరచన చేశాడని సీసీ ఫుటేజీ ఆధారంగా లభించిన ఆధారాల ప్రకారం పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరోవైపు కిలపర్తిపై కూడా శనివారం అర్థరాత్రి హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకోవడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.

కుమారునికి అడ్డు లేకుండా చేసేందుకే
తన కుమారుని ఎదుగుదలకు అడ్డు లేకుండా చేసుకునేందుకే యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణను జనగోల పత్రిక ఎడిటర్‌ కిలపర్తి వెంకటరమణ హత్య చేయించాడని తెలుస్తోంది. యోగా గురువు పొలమరశెట్టితో పాటు కిలపర్తి వెంకటరమణ కొడుకు ఈశ్వరరావు వియత్నాం దేశంలో యోగా పాఠాలు బోధిస్తున్నా రు. ఈ క్రమంలో తనకంటే పొలమరశెట్టికి పేరు ప్రఖ్యాతలు వస్తుండటంతో విషయాన్ని తండ్రి వెంకటరమణకు ఈశ్వరరావు తెలియజేశాడు. ఇంతలో గత ఏడాది కుటుంబ పనుల మీద పొలమరశెట్టి నగరానికి వచ్చాడు. ఇదే అదునుగా భావించిన కిలపర్తి వెంకటరమణ యోగా గురువు పొలమరశెట్టితో స్నేహం చేస్తున్నట్లు నమ్మించి కేసుల్లో ఇరికించాడు. వియత్నాం వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంకులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో పొలమరశెట్టి కోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అతను వియత్నాం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఎలాగైనా అంతమెందించాలని దుండగులతో కిలపర్తి ఒప్పందం చేసుకుని హత్యకు వ్యూహరచన చేశాడని పోలీసులు నిర్థారించారు. 

ఈశ్వరరావును రప్పించేందుకు యత్నాలు
యోగా గురువు హత్య కేసుతో పరోక్షంగా సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న కిలపర్తి వెంకటరమణ కొడుకు ఈశ్వరరావును వియత్నాం నుంచి రప్పించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈశ్వరరావును విచారించడంతో కేసులోని వాస్తవాలు బయటపడవచ్చని భావిస్తున్నారు. పొలమరశెట్టితో ఈశ్వరరావుకు గల మనస్పర్థలు ఏమిటి? హత్యకు పాల్పడిన ఆ నలుగురు ఎవరు? సుఫారీ ఎంత? కేసుతో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రిలో కోలుకుంటున్న కిలపర్తి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): యోగా టీచర్‌ పొలమరశెట్టి వెంకటరమణ హత్య కేసులో నిందితుడైన కిలపర్తి వెంకటరమణపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటనలో  గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణానికి ప్రమాదం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

పోలీసుల వైఫల్యంపై విమర్శలు
యోగా గురువు పొలమరశెట్టి హత్య జరిగిన వెంటనే సూత్రధారి కిలపర్తి వెంకటరమణ అని సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు నిందితుడిని  అదుపులోకి తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుపారీ కోసం నలుగురు దుండగులు ఫోన్‌ చేయడంతో కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌కు  కూతవేటు దూరంలోని బర్మాక్యాంపు సమీపంలోని లాల్‌ బహుదూర్‌ మైదానం వద్ద ఉన్న స్టీల్‌సిటీ పబ్లిక్‌ స్కూలు వెనుకకు స్టేషన్‌ ముందు నుంచే కిలపర్తి వెళ్లాడు. అనంతరం రాత్రి 12 గంటల వరకు అయిదుగురూ అక్కడే ఉండి... తర్వాత గొడవ జరగడంతో కిలపర్తిపై దాడి చేసి దుండగులు పరారయ్యారు. ఈ మొత్తం ఎపిషోడ్‌లో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని... నిందితునిగా గుర్తించిన వెంటనే కిలపర్తిని అదుపులోకి తీసుకోవడంలో అలసత్వం  ప్రదర్శించారని... అందువల్లే అతనిపై హత్యాయత్నం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తీరు మారనందుకే అంతమొదించా..!
యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణను తానే హత్య చేయించినట్లు కిలపర్తి వెంకటరమణ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణలో ఏం చెప్పాడంటే... తనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని... వారిలో తన పెద్ద కుమార్తెకు యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ అసభ్యకర మెసేజీలు పెడుతుండడంతో పలుమార్లు హెచ్చరించానని... అయినప్పటికీ అతని ప్రవర్తనలో మా ర్పు రాకపోవడంతో అంతమొదించేందుకు సిద్ధమయ్యా నని... ఇందుకోసం బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్, అతని స్నేహితులు కల్యాణ్, పవన్, కోటిలతో రూ.1.50లక్షలకు ఒప్పందం చేసుకున్నానని అంగీకరించాడు. వారు పొలమరశెట్టిని మర్డర్‌ చేశాక డబ్బులివ్వమని శనివారం రాత్రి ఫోన్‌ చేయడంతో  బర్మాక్యాంపు సమీపంలోని లాల్‌ బహుదూర్‌ మైదానం వద్ద ఉన్న స్టీల్‌సిటీ పబ్లిక్‌ స్కూలు వెనుక ప్రదేశానికి వెళ్లానని... ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పడంతో గొడవ జరిగి తనపై దాడి చేసి దుండగులు  పరారయ్యారని పోలీసులకు కిలపర్తి వెల్లడించినట్లు తెలిసిం ది. స్థానికులు గుర్తించి ఆది వారం తెల్లవారి 7గంటల సమయంలో 108 వాహనంలో కేజీహెచ్‌కు కిలపర్తిని తరలించారు. యోగా గురువును హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్న అజయ్‌కుమార్‌కు నేరచరిత్ర ఉందని, గతంలో భార్య హత్య కేసులో ముద్దాయి అని పోలీసులు గుర్తించారు.

దస్తావేజులో ఏముందంటే...
యోగా గురువు పి.వెంకటరమణ పేరుతో ఈ నెల 24న రూ.50ల  దస్తావేజు కొనుగోలు చేశారు. అందులో పొలమరశెట్టి వెంకటరమణ, కిలపర్తి వెంకటరమణ అనే ఇరువురం 15 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నాం. ఇటీవల పోలీస్‌స్టేషన్‌లలో క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో దూరంగా ఉంటున్నాం. ఇక నుంచి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అందుకు ఇద్దరం అంగీకరిస్తున్నాం. కోర్టులలో నడుస్తోన్న కేసుల విషయం మీద రాజీకి వచ్చాం అని రాసి ఉంది. దానిపై కిలపర్తి వెంకటరమణ సంతకం చేశాడు. సాక్షులుగా యోగా గురువు పొలమరశెట్టి వెంకటరమణ, అతని రెండో భార్య పద్మావతి స్వహస్తాలతో సంతకం చేశారు. రాజీ ఒప్పందం జరిగినట్టు దస్తావేజులో సంతకాలు చేసిన కొద్ది క్షణాలకే యోగా గురువు దారుణంగా హత్యకు గురయ్యాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top