విద్యుత్‌ షాక్‌తో నేత కార్మికుడి దుర్మరణం

Worker Of The Electric Shock Is Died - Sakshi

కొబ్బరి మట్టలు కొడుతుండగా షాక్‌

కొడుకు మృతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు

మృతుడి కుటుంబానికి ద్వారకనాథరెడ్డి పరామర్శ

మదనపల్లె క్రైం : కొబ్బరి మట్టలు కొడుతుండగా 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి నేత కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం మదనపల్లె పట్టణంలో జరిగింది. టూటౌన్‌ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ రామిగానిపల్లెకు చెందిన రామిగాని నాగిరెడ్డి, శకుంతలమ్మ దంపతులు 20 ఏళ్ల క్రితం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలోని భవాని నగర్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. వారి ఒక్కగానొక్క కుమారుడు వినోద్‌కుమార్‌రెడ్డి(23) చేనేత మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయోధ్యనగర్‌కు చెందిన శంకర్‌రెడ్డి గృహ ప్రవేశం చేస్తుండగా ఇంటికి కట్టేందుకు కొబ్బరి మట్టలు కావాలని వినోద్‌కుమార్‌రెడ్డిని అడిగాడు.

దీంతో అతను అయోధ్యనగర్‌లో ఉన్న సాంబశివయ్య ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కాడు. కొబ్బరి మట్టలు కొడుతుండగా మట్టవిరిగి 11 కేవీ విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో వినోద్‌కుమార్‌రెడ్డికి షాక్‌ కొట్టి చెట్టుపైనే మృతిచెందాడు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో ప్రజలు గుమికూడారు. 108 సిబ్బంది అక్కడికి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని చెట్టుపై నుంచి అతికష్టంమీద కిందకు దింపి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూకాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్‌కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top