సిటీలో జంట హత్యలు.. నరబలేనా..? | Womens Dead Bodies Find in Musi River Hyderabad | Sakshi
Sakshi News home page

జంట హత్యలు

Jan 23 2019 6:28 AM | Updated on Jan 23 2019 1:29 PM

Womens Dead Bodies Find in Musi River Hyderabad - Sakshi

లంగర్‌హౌస్‌: సిటీ పశ్చిమ మండల పరిధిలోని లంగర్‌హౌస్‌లో జంట హత్యల కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మూసీ నదిలో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. సమీపంలోని కల్లు కాంపౌండ్‌ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం  పౌర్ణమి కావడం, గతేడాది తొలి పౌర్ణమి నాడు ఉప్పల్‌లో చిన్నారి నరబలి ఉదంతం చోటుచేసుకోవడంతో... ఇదీ ఆ తరహా ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మృతదేహాలను పరిశీలించిన పోలీసులు అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మొఘల్‌ నాలా రింగ్‌ రోడ్డు నుంచి రాజేంద్రనగర్‌ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు ఉన్నాయి. మూసీనదిపై ఉన్న అత్తాపూర్‌ బ్రిడ్జ్‌ కింద స్థానికులు ఆకుకూరలు పండిస్తారు. రోజు మాదిరి మంగళవారం ఉదయం అక్కడికి వచ్చిన వీరు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పనులు పూర్తి చేసుకున్నారు.

మూసీలో కాళ్లుచేతులు కడుక్కోవడానికి వెళ్లగా, పిల్లర్‌ నెం.118 కింది భాగంలో ఒడ్డుకు సమీపంలో గడ్డి మొక్కల మధ్యలో ఓ మనిషి కాలు ఉండడాన్ని గమనించారు. దీంతో మృతదేహంగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన లంగర్‌హౌస్‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి 30–35 ఏళ్ల మధ్య వయస్కురాలైన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా... మరో కలకలం రేగింది. ఈ మృతదేహాన్ని తీసిన చోటే కదలిక ఉండడంతో ఇంకాస్త లోపలకు దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెండో దాన్ని బయటకు తీశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలు ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలు కుళ్లిపోకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

ఆరాతీసినా...  
ఈ మృతదేహాలు బయటపడిన ప్రాంతానికి సమీపంలో కల్లు కాంపౌండ్‌ ఉంది. అక్కడకు వెళ్లి పోలీసులు ఈ మృతదేహాల ఫొటోలు చూపించి ఆరా తీసినా ఫలితం లభించలేదు. ఘటనాస్థలిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ప్రాంతానికి దారి తీసే మార్గాల్లో ఉన్న వాటిలో నమోదైన ఫీడ్‌ను పరి«శీలిస్తున్నారు. మృతదేహాలు లభించిన చోట ఎలాంటి పెనుగులాట, హత్యలు జరిగిన ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఇద్దరినీ మభ్యపెట్టి తీసుకొచ్చి ఇక్కడే చంపారా? లేక వేరే ప్రాంతంలో చంపి తీసుకొచ్చి పడేశారా? అనే అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. రెండు మృతదేహాలపై ఉన్న వస్త్రాలు చెల్లాచెదురుగా ఉండడాన్ని బట్టి హత్యకు ముందు అఘాయిత్యం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పోస్టుమార్టం పరీక్షలు పూర్తయితే తప్ప ఆ విషయం నిర్ధారించలేమని అంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు మృతదేహాల ఒంటి నిండా పసుపు ఉంది. దీనికితోడు గతేడాది జనవరిలో వచ్చిన పౌర్ణమి తర్వాతి రోజు ఉప్పల్‌ చిలుకానగర్‌లోని రాజశేఖర్‌ ఇంటిపై చిన్నారి మృతదేహం కనిపించింది. ఈసారి పౌర్ణమి మరుసటి రోజు ఈ రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఇది కూడా నరబలే అని పుకార్లు చెలరేగాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని, గాయాలు సైతం అలాంటి స్థితిలో లేవని పేర్కొంటున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement