భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

Women Commits Suicide When Husband Harassment Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, మాడుగుల: వివాహమై తరువాత నాలుగేళ్ల వరకు కాపురం బాగా సాగింది.   ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగుతుందని ఆశపడిన ఆమె తరువాత నకరాన్ని చవిచూసింది. పిల్లలు పుట్టాక   భర్త  అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.  తట్టుకోలేక పోయింది. పిల్లత్తో  సహా నాలుగేళ్లు  పుట్టింటిలో ఉండిపోయింది.   కాపురం నిలబెట్టుకోవాలని తల్లిదండ్రులు, పెద్దలు నచ్చజెప్పడంతో అమ్మగారి ఊరైన తుని నుంచి మాడుగుల వచ్చింది.  కానీ భర్త వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో భరించలేక చావే శరణ్యమని భావించి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఎస్‌ఐ తారకేశవరావు,  గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2002 సంత్సరంలో తునికి చెందిన నూకరత్నానికి  స్థానిక కొబ్బరితోట వీధికి చెందిన కొండబాబుతో వివాహం జరిగింది.

కొండబాబు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగిన నాలుగేళ్ల తరువాత అదనపు కట్నం తేవాలని నూకరత్నం(32)ను వేధించడం ప్రారంభించాడు. భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. పంచాయతీ పెద్దలు సర్దిచెప్పడంతో ఆమె మళ్లీ భర్త వద్దకు వచ్చింది.  అయితే భర్త తీరులో మార్పు రాలేదు. రోజూలాగే శనివారం కూడా నూకరత్నంతో కొండబాబు గొడవపడ్డాడు. దీంతో  తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె... అందరూ నిద్రపోయాక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ తెలిపారు. నూకరత్నానికి ఇద్దరు  ఆడపిల్లలుపుట్టారు.  ఓ పాప ఏడాది కిందట మృతి చెందింది. మరో పాప ప్రస్తుతం ఆర్‌సీఎం హైస్కూల్‌లో 8 వ తరగతి చదువుతోంది.తల్లి మృతదేహం వద్ద ఆ బాలిక రోదిస్తున్న తీరుచూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. మృతిరాలి సోదరుడు ప్రగడ అప్పారావు ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top