కి'లేడీ' కోసం గాలింపు !

Women Cheated By Telling PA To Government Chief Secretary In TDP Government Time - Sakshi

గుంటూరు : టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు చేసిన ఘరానా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని, బిల్లులు మంజూరు చేయిస్తానని అనేక మంది వద్ద రూ.లక్షల్లో వసూలు చేసిన ఓ మహిళ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో అక్రమార్కులను పక్కన చేర్చుకున్నాడనేందుకు మరో ఘటన నిదర్శనంగా నిలిచింది. కొందరు మహిళలు కూడా చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా మోసాలు, అవినీతికి పాల్పడ్డారంటే పరిస్థితి అప్పట్లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వారికి సంబంధించిన బాగోతాలు జిల్లాలో ఏదో ఒక మూలన బయటపడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు కే ట్యాక్, ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన మైనింగ్‌ మాఫియా ఘటనల గురించి ప్రజలు మరువక ముందే తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏగా పనిచేస్తున్నానంటూ టీడీపీ నాయకుల అండదండలతో  కాకుమాను మండలం బోడుపాలెం గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి దీప్తి అక్రమ వ్యవహారంలో బహిర్గతమయ్యాయి. సచివాలయంలో హల్‌చల్‌ చేసి అమాయకులను నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు కాజేసింది.  ఈ మేరకు బాధితులు ఈ నెల 15వ తేదీన   పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

మోసాలకు పాల్పడిందిలా..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉద్యోగాల కోసం ఆశ్రయించే వారిని దీప్తి సచివాలయానికి తీసుకువెళ్లి వారిని దూరంగా ఉంచేది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏననీ, సీఎంవోలో పీఏగా చేస్తున్నానంటూ  నమ్మించేందుకు  ముంత్రుల శాఖల కార్యాలయాల్లోకి వెళ్లి వస్తూ హల్‌చల్‌ చేసేది. అది నిజం అని నమ్మి ఆమె డిమాండ్‌ చేసిన విధంగా బాధితులు డబ్బు అందజేశారు. కడప జిల్లాకు చెందిన బాధితుడు  వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి తో పాటు గుంటూరు చెందిన వారు కూడా బాధితులుగా మారారు. దీంతో ఈ నెల 15 వ తేదీన ఫిర్యాదు చేయడంతో పెదకాకాని పోలీసులు  కేసు నమోదు చేశారు.  

బిల్లులు మంజూరు చేయిస్తానని...
గుంటూరులోని కృష్ణనగర్‌కు చెందిన మన్నవ వంశీకృష్ణ వినుకొండ, నరసరావుపేట మున్సిపాలిటీల పరిధిలో చేసిన కాంట్రాక్ట్‌ పనులకు సంబంధించి లక్షల రూపాయల పనులు చేసి బిల్లులు రాకపోవడంతో సీఎంవోలో పరిచయస్తుల కోసం తిరుగుతుండగా దీప్తి తారసపడింది. తాను మంజూరు చేయిస్తానంటూ నమ్మించి అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేషీలోకి తీసుకువెళ్లి నమ్మించి ఈ ఏడాది ఏప్రియల్‌లో రూ లక్ష తీసుకుందని బాధితుడు అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణ కొనసాగుతోంది. దీప్తి మోసాలు బయట పడటంతో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

విలాసవంతమైన జీవితం...
ఖరీదైన కార్లలో తిరుగుతూ కార్లుపై ఎమ్మెల్యేల స్టిక్కర్లు వేసుకొని తాను సీఎంఓలో పీఏగా చేస్తున్నానంటూ అనేక మందిని బురిడీ కొట్టించిందని తెలిసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విజయవాడ, హైదరాబాద్‌లలో ఖరీదైన హోటళ్లలో బస చేస్తుండేదని సమాచారం. స్వగ్రామమైన బోడుపాలెంలో నివాసం ఉండకుండా గుంటూరులోని విద్యానగర్‌లో, నంబూరు సమీపంలోని ఐజేఎంలో విలువైన ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం ఆరా తీస్తున్నారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన దీప్తి వారం రోజుల క్రితమే రెండు నివాసాలకు తాళం వేసి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కిలాడీ లేడీ ఆచూకీ కోసం గాలింపులో భాగంగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. త్వరలోనే నిందితురాలిని పట్టుకుంటామని చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top