నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్‌ పోసి..

Woman Burnt Alive In Mahabubnagar - Sakshi

నారాయణపేట రూరల్‌: ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావుతో పోరాడుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలంలోని తిర్మలాపూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండప్పకు ఇరవై ఏళ్ల క్రితం కొండాపూర్‌ గ్రామానికి చెందిన చెన్నమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కూలీ పనులకు వెళ్తున్న ఈమెకు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈనెల 2న ఇద్దరూ కలిసి ఇంట్లో ఉండటాన్ని చూసిన చుట్టుపక్కల వారు గట్టిగా మందలించారు. మరునాడు సాయంత్రం బజారులో నడుచుకుంటూ వెళ్తున్న చెన్నమ్మను శేఖర్‌ లాక్కొని వెళ్లి తన ఇంట్లో బంధించాడు.

ఈ క్రమంలో గ్రామస్తులు వచ్చి ఆమెను విడిపించి తీసుకువెళ్లే క్రమంలో గొడవ చోటుచేసుకుంది. దీనిని మనుసులో ఉంచుకుని అదే రోజు రాత్రి కొండప్ప కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో నిద్రించగా.. రాత్రి ఒంటిగంట సమయంలో శేఖర్‌ తన మిత్రులతో కలిసి వచ్చి చెన్నమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంటలకు మేల్కొన్న చెన్నమ్మ పక్కనే ఉన్న తన కూతురును దూరంగా నెట్టేసింది. అప్పటికే తన చీరకు నిప్పు అంటుకోవడంతో కేకలు వేయడంతో మంచంపై నిద్రించిన భర్త లేచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం 108లో నారాయణపేట ఆస్పత్రికి.. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించారు. అయితే 50 శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనకు కారణమని ముగ్గురిపై ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top