మనిషి రాక్షసుడవుతున్న వేళ..!

Woman Attack on Man in Chittoor Video Viral In Social Media - Sakshi

ఆవేశంలో విచక్షణ కోల్పోతున్న వైనం

ఒక్కడిపై మూకుమ్మడి దాడులు.. వీడియోలు

కలవరపెడుతున్న చిత్తూరు వరుస ఘటనలు

చిత్తూరు అర్బన్‌:  మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నప్పుడు రాక్షసుడిగా మారుతాడు. ఇది ముమ్మాటికీ నిజమేనని చిత్తూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న ఉదంతాలు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా ఒక్కడిపై గుంపుగా దాడి చేసి, చితకబాదుతూ, ఆ దృశ్యాలను సెల్‌ కెమెరాలో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందుతుండటం ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా పెద్ద హీరోయిజంలా సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అవుతున్నాయి.

ఏం చెప్పదలచుకున్నారు..?
చిత్తూరుకు చెందిన సాగర్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని చిట్టిబాబునాయుడు ఈనెల 13న ప్రవర్తించిన తీరు చూస్తే అసలు వీళ్లు మనుషులేనా? అనే అనుమానం కలుగుతోంది. పనికి రాలేదనే నెపంతో పెనుమూరుకు చెందిన వేణుగోపాల్‌ను మూడు గంటల పాటు తన అనుచరులతో కలిసి కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చిట్టిబాబుతో పాటు నలుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా.. అందరూ ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటోంది. ఒక దశలో వేణుగోపాల్‌ మర్మాంగంపై కర్రతో పొడవడానికి చిట్టిబాబు ప్రయత్నించడం, చికెన్‌ సెంటర్‌లో పనిచేసే వ్యక్తులు వేణుగోపాల్‌ను వెనుక నుంచి ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్నడం, విరిగిన చేయిని మరోచేతితో పట్టుకుని బాధితుడు దండం పెడుతున్నా వీరి వదలకుండా పదే..పదే హింసించడం చూస్తే ఎవరికైనా రక్తం మరగకమానదు.

ఇక ఈనెల 20న చిత్తూరులోని మిట్టూరుకు చెందిన గీతూరెడ్డి అనే మహిళ, ఆమె కుమారుడు శరత్‌కుమార్‌ సాదిక్‌ అనే యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు చూసినవారు కడుపు తరుక్కుపోతోందంటున్నారు. సాదిక్‌ అతని స్నేహితుడి మధ్య ఓ యువతి విషయమై వివాదం రేగింది. దీనిపై పంచాయతీ చేయడానికి సాదిక్‌ను గీతూరెడ్డి తన ఇంటికి పిలిపించింది. తన గురించి ఇతరులకు ఎందుకు చెడుగా చెబుతావంటూ అతడిపై చేయి చేసుకుంది. అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత గీతూరెడ్డితోపాటు ఉన్న శరత్‌ స్నేహితులు ఏడుగురు ఓ కల్యాణమండపం వద్ద మరోసారి సాదిక్‌ను చితకబాదారు. మొహం, కడుపుపై కాళ్లతో తన్నడం, పిడి గుద్దులు కురిపించడం, కింద పడ్డా పైకిలేపి మరీ కాళ్లతో తన్నడం.. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టురా! అని మరొకరు అనడం చూస్తుంటే రాన్రాను మనిషిలో మానవత్వం ప్రశ్నార్థకమవు తోంది. పైగా కొట్టిన పిల్లల్లో నలుగురు మధ్య తరగతి, ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లలు.. మైనర్లు ఉండటం గమనార్హం!

బంధాలకు విలువేదీ?
ఇప్పుడు ప్రతి  ఇంటాస్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగా మాట్లాడరు. పిల్లలు తోబుట్టువులతో ఆడుకోరు. అందరూ కూర్చుని భోంచేసిన ఘటనలు అరుదు. పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో పడేసి స్మార్ట్‌ఫోన్లు తీసుకుని వాట్సప్, ఫేస్‌బుక్‌లలో గంటల కొద్దీ గడపడం. కొందరైతే హింసాత్మకమైన గేమ్‌లను తరచూ ఆడుతూ వాటి ప్రభావానికి గురై హింసాప్రవృత్తితో మసలుకుంటున్నారు. కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సరైన ప్రేమానురాగాలు లేకపోవడం, పిల్లలకు విలువల చెప్పకపోవడమే ఈ తరహా ఘటనలకు ప్రధాన కారణమవుతోంది.

పేరెంట్స్‌దే బాధ్యత
పిల్లల ప్రవర్తన విషయంలో ఇంట్లోని పెద్దల తీరు కూడా ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడం, ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం, తిట్టుకోవడం..ఇత్యాది ఘటనలను చూస్తూ పిల్ల ల మనస్తత్వం కూడా మారిపోతోంది. పరుగులు తీస్తున్న యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం, వారి నుంచి ఆశించిన ప్రేమ లభించకపోవడంతో పిల్లలు దారి తప్పుతున్నారు. బయటివ్యక్తుల వద్ద అనుచరులుగా తిరగడం, వారిపై అభిమానం చూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టులకు నెగటివ్‌ కామెంట్లు పెడితే దాడులు చేసి జైలుపాలవుతున్నారు. ఇప్పటికైనా పిల్లలకు ప్రేమానురాగాలు పంచడం, ఇంటికి వెళ్లగానే వారితో సరదాగా ముచ్చటిస్తూ, మంచీ–చెడు చెప్పించడం..లాంటివి చేస్తే సమాజానికి మంచి పౌరులను అందించినవారుతారని అటు మానసిన వైద్యనిపుణులు, ఇటు పోలీసులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top