స్కూళ్లే లక్ష్యంగా యువతి కొత్త తరహా మోసం

Woman Arrested For Blackmailing Schools With Morphed Photos In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువతి తన తెలివితేటలను ఉపయోగించి కొత్త తరహా మోసానికి తెర లేపింది. స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ డబ్బులు వసూల్‌ చేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం కటకటాలపాలైంది. వివరాలు... నగరానికి చెందిన 21 ఏళ్ల యువతి బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివింది. విలాసాలకు అలవాటుపడిన ఆమె వివిధ స్కూళ్లకు సంబంధించిన వెబ్‌సైట్లను, సోషల్‌ మీడియా అకౌంట్లపై దృష్టి సారించింది. స్కూళ్లకు సంబంధించిన పలు ఈవెంట్లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకునేది. వాటిని మార్ఫింగ్‌ చేసి తిరిగి ఆ స్కూల్‌ అకౌంట్లకే పంపించేది. తాను సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నానని... మీకు సంబంధించిన అశ్లీల ఫొటోలు నా వద్ద ఉన్నాయంటూ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించేది. తనకు డబ్బులు ఇస్తేనే వాటిని సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేది.

ఈ నేపథ్యంలో యువతి ఆగడాలు రోజురోజుకీ శ్రుతిమించడంతో ఓ బాధిత స్కూలు యాజమాన్యం సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు యువతి బండారం బట్టబయలైంది. విద్యార్థులకు సంబంధించిన విషయం కావడంతో ఈ కేసును సవాలుగా తీసుకుని.. త్వరితగతిన ఛేదించినట్లు అడిషనల్‌ సీపీ రఘువీర్‌ తెలిపారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో 225 స్కూళ్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. స్కూల్‌ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి.. వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి..తన నంబరు ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేదని పేర్కొన్నారు. ఇక సోషల్‌ మీడియా వల్ల లాభాలతో పాటు ఎన్నో నష్టాలు కూడా ఉన్నందున వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రఘువీర్ సూచించారు. పర్సనల్‌ ఫొటోలు పెట్టేపుడు ప్రైవసీ సెట్టింగ్స్‌ ఫాలో అయితే ఇలాంటి కిలాడీల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top