నమ్మించి నగలు కాజేసింది

Woman Arrest in jewellery Robbery Case - Sakshi

బంగారు ఆభరణాలు కాజేసిన సహాయకురాలు

వీటి విలువ రూ.7.95 లక్షల పైమాటే

ఆమెతో పాటు నగలు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ఓ ఇంట్లో సహాయకురాలిగా చేరిన బాలిక.. ఆ కుటుంబ సభ్యులతో నమ్మకంగా నటించింది. అదను చూసి రూ.7.95 లక్షల బంగారు ఆభరణాలు కాజేసింది. ఈ బంగారు ఆభరణాలను ఓ ఫ్యాన్సీ దుకాణదారుడికి ఇచ్చి.. సొంతూరులో దుకాణం పెడతానని ఫ్యాన్సీ సామాన్లు తీసుకెళ్లేది. ఆ బాలిక ఇచ్చిన వాటిలో ఓ బంగారు ఆభరణాన్ని ఫ్యాన్సీ దుకాణదారుడు విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. కంచరపాలెం నేరవిభాగ పోలీస్‌స్టేషన్‌లో  శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను క్రైం డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ఫాల్గుణరావులు వెల్లడించారు.

సింహాచలం టీవీ టవర్‌ కాలనీలో మునగల పూర్ణిమ నివాసం ఉంటున్నారు. విజయనగరం జిల్లా, కందపాలెం, గొల్లవీధికి చెందిన 15 ఏళ్ల బాలిక ఆమె ఇంట్లో çసహాయకురాలిగా చేరింది. యజమానురాలి వద్ద నమ్మకంగా నటించింది. గత డిసెంబర్‌ 30వ తేదీ నుంచి బీరువాలో ఒక్కోరోజు ఒక్కో బంగారు ఆభరణాన్ని దొంగలించింది. ఇలా పూర్ణిమ ఇంట్లో రూ.7.95 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసింది. ఇందులో 6 తులాల రెండు హారాలు, 5 తులాల చైన్, తులంన్నర నక్లెస్, 2 తు లాల జిగిని నక్లెస్, అరతులం చెవి రింగులు, మూడున్నర తులాల డైమండ్‌ నక్లెస్‌ తదితర ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయంలో యజమానురాలికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఈ నెల 12న పూర్ణిమ డైమండ్‌ నక్లెస్‌ కోసం బీరువా చూడగా.. అందులో బంగారు ఆభరణాలు మాయమవడాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. బయట నుంచి ఇంటికి బాలిక మాత్రమే వస్తుందని పోలీసులు గుర్తించారు.

కాగా.. బాలిక దొంగిలించిన నగలను సింహాచలం ఆయిల్‌ మిల్‌ సమీపంలో శ్రీ సాయినగర్‌లో ఉన్న ఫ్యాన్సీ దుకాణం యజమాని కాణిపాకం త్రిరుణాకర్షకకు ఇచ్చింది. సొంతూరులో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకుంటానని చెప్పి, సామాన్లు తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఫ్యాన్సీ దుకాణదారుడు బాలిక ఇచ్చిన నగల్లో నక్లెస్‌ను మార్చేందుకు పూర్ణామార్కెట్‌లోని బంగారు దుకాణా నికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బంగారు దుకాణదారుడికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు త్రిరుణాకర్షకను విచారించగా జరిగిందం తా చెప్పేశాడు. ఈ విషయం పూర్ణిమకు తెలియజేయడంతో ఆమె అవాక్కైంది. ఆమె ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలికతో పాటు త్రిరుణాకర్షకను అరెస్ట్‌ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపారు. ఈ కేసును ఛేదించిన పశ్చిమ సబ్‌ డివిజన్‌ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్‌ఐ తమ్మినాయుడు, ఏఎస్‌ఐ కె.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ శామ్యూల్, కానిస్టేబుళ్లు సుధాకర్, సుజేశ్వరిలను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top