రేపటి నుంచి మద్యం బంద్‌..! | Wines And Bars Dealers Association Strike AP Government | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మద్యం బంద్‌..!

Mar 27 2018 7:46 AM | Updated on Aug 17 2018 7:40 PM

Wines And Bars Dealers Association Strike AP Government - Sakshi

తిరుపతి రూరల్‌: మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం అమ్మకాలపై మార్జిన్‌ను సగానికి పైగా తగ్గించేసి, తమను నిలువునా ముంచిందని చిత్తూరు జిల్లా వైన్స్, బార్స్‌ డీలర్ల అసోసియేషన్‌ నేతలు మండిపడ్డారు. షాపుల నిర్వహణ భారంగా మారడంతో ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిలుపుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అందులో భాగంగా మంగళవారం మద్యం డిపోల నుంచి స్టాక్‌ కొనుగోలును నిలుపుదల చేస్తారు. ఆమేరకు సోమవారం తిరుపతి రూరల్‌ మండలం పద్మావతీపురం పంచాయతీలోని ఓ ప్రైవేటు హోటల్లో అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తుమ్మల.గుణశేఖర్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 415 వైన్‌ షాపులు, 17 బార్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా రోజుకు దాదాపు రూ.2.5 కోట్లు నుంచి రూ.3 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.

గతంలో అమ్మకాలపై 18శాతం మార్జిన్‌ ఉండేదన్నారు. గత ఏడాది షాపుల టెండర్ల ప్రక్రియ గెజిట్‌లో ప్రభుత్వం మార్జిన్‌ను నమోదు చేయలేదని, కొత్త విధానంలో లైసెన్సు ఫీజులు తగ్గిం చామంటూ, మద్యం అమ్మకాలపై వ్యాపారులకు ఇచ్చే మార్జిన్‌ను గణ నీయంగా తగ్గించిందని వాపోయారు. అమ్మకాలపై సరైన మార్జిన్‌ లేకపోవడంతో వ్యాపారులకు లాభాలు రాకపోగా, షాపుల అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు, ఇతర నిర్వాహణ ఖర్చులతో ఒక్కో దుకా ణానికి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ద్వారా లాభాలు ఆర్జిస్తున్న సర్కారు తమను నష్టాల్లోకి నెట్టేస్తోందని పలువురు వ్యాపారులు మండిపడ్డారు. నష్టాలకు తోడు అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తూ ఎవరైనా పట్టుపడితే ఆ ప్రాంతంలోని మద్యం షాపును సీజ్‌ చేసి, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైనా మార్జిన్‌ ఇవ్వకుండా వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్న ప్రభుత్వం తీరుకు నిరసనగా ఉద్యమించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

నేడు స్టాక్‌ కొనుగోలు బంద్‌...రేపటి నుంచి మద్యం షాపుల మూత..!
ప్రభుత్వం చేతకాని తనానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం మద్యం డిపోల నుంచి మద్యం షాపులకు స్టాక్‌ కొనుగోలును వ్యాపారులు నిలుపుదల చేస్తున్నారు. అంటే మంగళవారం షాపులో ఉన్న స్టాక్‌ను మాత్రమే విక్రయిస్తారు. అలాగే బుధవారం నుంచి జిల్లాలోని అన్ని వైన్స్, బార్లను మూసి వేసి మద్యం విక్రయాలను బంద్‌ చేయనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గుణశేఖర్‌నాయుడు తెలిపారు. అమ్మకాలపై మార్జిన్‌ను 18 శాతానికి పెంచాలని, వేధింపులను ఆపాలని, బెల్టుషాపు నిర్వహిస్తూ పట్టుబడితే వారిపైనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు పరంధమ్‌రెడ్డి, మునస్వామిరెడ్డి, ప్రహ్లాదరెడ్డి, వెంకటేష్, కుమారస్వామిరెడ్డి, నాధమునిరెడ్డి, మునెయ్యనాయుడు, మద్యం డీలర్లు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న మద్యం వ్యాపారులు

Advertisement
 
Advertisement
Advertisement