వేధింపులు భరించలేకే హతమార్చా..

Wife Revealed Husband Murder Case In Guntur - Sakshi

విచారణలో అంగీకరించిన మృతుడి భార్య

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ

గుంటూరు: ‘వ్యసనాలకు బానిసగా మారిన నా భర్త వేధింపులు భరించలేక కడతేర్చాలని నిర్ణయించుకున్నా. నా తమ్ముడి సహకారంతో హతమార్చాను’ అని పెద్దకాకాని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేతావత్‌ మల్లేశ్వరి బాయ్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు వివరాలు వెల్లడించారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామానికి చెందిన బాణావత్‌ బాయ్‌కు తన కుమారుడు మరణించాడన్న వార్త ఏప్రిల్‌ 13న పెదకాకాని రోడ్డు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వ్యక్తుల ద్వారా తెలిసింది. హుటాహుటిన గుంటూరు చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

మృతుడి మెడ చుట్టూ అనుమానాస్పదంగా నల్లని చార ఉండటంతో పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించి ఆమె ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. అప్పటికే మృతుడి భార్య మల్లేశ్వరి భాయ్, ఆమె తమ్ముడు తులసీరామ్‌నాయక్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో సీఐ బి.శ్రీనివాసరావు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 13న మద్యం సేవించి ఉన్న తన భర్తను సెల్‌చార్జర్‌ వైరుతో మెడకు వేసి తన తమ్ముడి సహకారంతో హతమార్చినట్లు నిందితురాలు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్య చేసినట్లు రావడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top