సర్పంచ్‌గా పోటీ చేయాలని వేధింపులు.. వివాహిత సూసైడ్‌..!

Wife Committed Suicide Due To Harassment By Husband In Nalgonda - Sakshi

సాక్షి, దిండి : సర్పంచ్‌ ఎన్నికలు ఓ కుటుంబంలో చిచ్చు రేపాయి. భార్యను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఓ భర్త వేధింపులకు గురిచేశాడు. దాంతోపాటు పుట్టింటి నుంచి రూ.5 లక్షల తీసుకురావాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని దిండి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్య, రాధ (22) దంపతులు. వీరికి 8 నెలల కిందట వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న బైక్‌ కోసం లింగమయ్య రాధను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో ఎర్రగుంటపల్లి సర్పంచ్‌ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తన భార్యను పోటీచేయించడానికి లింగమయ్య ఆసక్తి చూపించాడు.

సర్పంచ్‌గా పోటీ చేయాలని రాధను ఒత్తిడి చేశాడు. పుట్టింటికి వెళ్లి 5 లక్షల రూపాయలు తేవాలని వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు భైరాపురం మీనయ్య, శారదలకు తన గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకపోయింది. బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాధ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top