
వయనాడ్: కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో 10 ఏళ్ల బాలికను పాము కాటేసింది. విషయాన్ని క్లాస్ టీచర్‌కు చెప్పగా.. ఏదో చిన్న గాయమని ఆమె నిర్లక్ష్యం వహించింది. బాలిక తండ్రి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాడని చెప్పి ఆమె తన పాఠం చెప్పడాన్ని కొనసాగించింది. బాలిక నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. చివరికి తండ్రి వచ్చి ఆస్పత్రికి తరలించేలోపే బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన వయనాడ్ ప్రాంతంలోని సుల్తాన్ బథేరీలోని ఒకేషనల్ సెకండరీ స్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న స్నేహలా షెరీన్ (10) కాలు క్లాస్‌రూమ్‌లోని చిన్న రంధ్రంలో ఇరుక్కుంది. కుట్టినట్లు అనిపించడంతో విషయాన్ని క్లాస్ టీచర్ షీజిల్‌కు చెప్పింది. ఆమె ఏదో గీసుకుపోయి ఉంటుందని చెప్పి తన పనిని కొనసాగించింది. బాలిక తండ్రికి సమాచారం అందించింది. బాలిక తండ్రి పాఠశాలకు చేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే బాలిక కన్నుమూసింది. ఈ ఘటనలో క్లాస్ టీచర్ షీజిల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.