ఏసీబీ వలలో వేమవరం వీఆర్వో

VRO Koteswar Rao Caught Demanding Bribery In Guntur - Sakshi

భూమి వివరాలు ఆన్‌లైన్‌ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్‌

రూ. 3 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

రెవెన్యూ వర్గాల్లో కలకలం

గుంటూరు, మాచవరం: మండలంలోని వేమవరం గ్రామ వీఆర్‌వోగా పనిచేస్తున్న మీసాల కోటేశ్వరరావు రూ.3వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అవినీతి నిరోధక శాఖ అడిషనల్‌ ఎస్పీ  సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి నరసింహారావు బాబాయి వడ్లమూడి సత్యన్నారాయణ దాచేపల్లి మండలం నడికుడిలో నివాసం ఉంటున్నారు. సత్యన్నారాయణ పేరున వేమవరం శివారులో 3.50 ఎకరాల సాగుభూమి ఉంది. వన్‌బీ, అడంగళ్‌ ఆన్‌లైన్‌ చేసుకునేందుకు ఈనెల 8వ తేదీన మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ చేసేందుకు వీఆర్‌వో కోటేశ్వరరావు  సత్యన్నారాయణను రూ.5 వేలు ఇమ్మని అడిగాడు. అంత మొత్తంలో ఇవ్వలేమని రూ.3వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా లంచం ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు గురువారం వీఆర్‌వో గూర్చి ఆరా తీశారు. శుక్రవారం ఉదయం వీఆర్‌వో కోటేశ్వరరావు ఆన్‌లైన్‌ చేసేందుకు ఇస్తామన్న రూ.3వేలు డబ్బులు తీసుకుని రావాలని  రైతుకు రెండుసార్లు ఫోన్‌ చేశాడు. అనుకున్న ప్రకారం ఏసీబీ అధికారులు రైతుకు నగదు ఇచ్చి పంపారు. వీఆర్‌వోను తనిఖీ చేయగా రూ.3 వేలు నగదు దొరికాయి. నగదు స్వాధీనం చేసుకొని కేసును నమోదు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఆండ్‌ బీ ఏఈ గణేష్‌కుమార్, జూనియర్‌ అసిస్టెంట్‌ దినేష్, ఏసీబీ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top