లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో

VRO Caught While Taking Bribe In Srikakulam - Sakshi

వెబ్‌ల్యాండ్‌లో పేరు మార్పునకు రూ.5 వేలు డిమాండ్‌

విసిగి ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): వెబ్‌ల్యాండ్‌లో పేరు మార్పునకు ఐదు వేల రూపాయలు తీసుకుంటూ కోమర్తి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. తన ఆస్తిని భార్య పేరున మార్చమని కోరిన హోంగార్డు కె.శంకరరావును వీఆర్వో వై.రాజు లంచం అడిగాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేందర్, తెలిపిన వివరాలు.. శ్రీకాకుళంలో హోంగార్డుగా పనిచేస్తున్న కె.శంకరరావు భార్య లక్ష్మి పేరున యారబాడులో 33 సెంట్ల భూమి ఉంది. గడిచిన పదేళ్లుగా శిస్తు కడుతున్నారు.

గత నెలలో ఈ భూమిని ఇతరులకు అమ్మేందుకు శంకరరావు ప్రయత్నించగా వెబ్‌ల్యాండులో శంకరరావు తండ్రి మల్లేశ్వరరావు పేరున ఉంది. ‘పట్టాదారు పుస్తకం భార్య పేరున ఉంది.. ఈమేరకు శిస్తు కడుతున్నాను.. ఎందుకిలా జరిగింద’ని బాధపడ్డ శంకరరావు పాస్‌ పుస్తకం ప్రకారం తన భార్య పేరున వెబ్‌ల్యాండులో పేరు మార్చాలని వీఆర్వో రాజును కోరాడు. పేరు మార్చడానికి వీఆర్వో రూ.5 వేలు డిమాండ్‌ చేశాడు. శంకరరావు రూ.2 వేలు ఇచ్చినా పని జరగలేదు. మిగిలిన డబ్బు ఇస్తేనే పనిచేస్తానని డిమాండ్‌ చేయడంతో శంకరరావు కడుపు మండి ఏసీబీని ఆశ్రయించారు.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా..
కొమర్తి స్కూల్‌ వద్ద వీఆర్వో ఉన్నట్లు తెలుసుకొని ఏసీబీ అధికారులు స్కూల్‌ వద్దకు గురువారం సాయంత్రం వచ్చారు. అక్కడ లేకపోవడంతో శంకరరావుతో ఫోన్‌ చేయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్నాను.. రమ్మని వీఆర్వో రాజు చెప్పడంతో శంకరరావును తీసుకొని ఏసీబీ అధికారులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దకు వచ్చారు. శంకరరావు నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకొన్న ఏసీబీ సిబ్బంది తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి రికార్డులను పరిశీలించి.. వీఆర్వో ప్రవర్తనతో శంకరరావు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన అనంతరం కేసు నమోదు చేశారు. వీఆర్వో రాజును అదుపులోనికి తీసుకున్నామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేందర్‌ తెలిపారు.

హడలిపోయిన రెవెన్యూ కార్యాలయ సిబ్బంది
గురువారం సాయంత్రం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వేళ.. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కార్యాలయానికి రావడంతో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు ఎవరిని పట్టుకుంటారో.. ఎవరు దొరికిపోతారో అని  రెవెన్యూ సిబ్బంది ఆందోళన  చెందారు. చివరికి కోమర్తి వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

నాలాగ ఎందరో..
కోమర్తి, యారబాడు పంచాయతీల్లో తనలా అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు శంకరరావు చెప్పారు. డబ్బు ముట్టందే వీఆర్వో రాజు పనులు చేయరని, చిన్న పనికి తనను అనేక అవస్ధలు పెట్టడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏసీబీ అధికారుల సహకారంతో అవినీతి అధికారి ఆట కట్టిందన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top