వీఆర్‌ఏ దారుణ హత్య

VRA Couple Assassinated in Mancherial - Sakshi

దంపతులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ

తాండూర్‌(బెల్లంపల్లి):  గుర్తు తెలియని వ్యక్తులు దంపతులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య కొనఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. ఎస్సై కె.శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం... రేచిని గ్రామానికి చెందిన గజ్జెల్లి పోశం(55) మండలంలోని గంపలపల్లి వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకుడు)గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి పోశం, అతని భార్య శంకరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎవరో తలుపు కొట్టిగా పోశం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే విద్యుత్‌ మీటర్‌ తీగ కట్‌ చేశారు. చీకట్లోనే తలుపు తీయడంతో  ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు పోశం, శంకరమ్మలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.

వారిని ప్రతిఘటించిన శంకరమ్మ తీవ్ర గాయాలతో అరుస్తూ రోడ్డుపైకి పరుగెత్తి కొద్ది దూరం వరకు వెళ్లి  çస్పృహ తప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 సిబ్బంది, స్థానికులు ఇంటికి వెళ్లి చూసే సరికి పోశం రక్తపు మడుగులో మృతిచెంది కన్పించాడు. దీంతో శంకరమ్మను మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలించారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న సీఐ సామల ఉపేందర్, ఎస్సైతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్వా్కడ్‌లతో ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలం గ్రామంలో పలుచోట్ల వెళ్లినప్పటికీ స్పష్టమైన ఆధారాలు లభించలేదు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోశం కూతురు రాజేశ్వరి, అల్లుడు వెంకటేష్, బంధువుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భూ తగాదాలే కారణమా?
పోశం దంపతులపై దాడికి భూ తగాదాలే కారణమై ఉండొచ్చని స్థానికంగా చర్చ సాగుతోంది. పోశం ఇంటి ఎదుట రోడ్డు విషయంలో కొంత కాలంగా పోశం అన్న కొడుకు తిరుపతి, పోశం తమ్ముడు రాజన్నలతో వివాదం నెలకొంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రాజీ కుదిర్చారు. అయినప్పటికీ ఆ వివాదం చల్లారక హత్యకు దారితీసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదంతోనే ఆ ఘాతుకం చోటు చేసుకుందా, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. పోశం భార్య శంకరమ్మ ఫోన్‌లో చెప్పిన సమాచారంతో అల్లుడు కాటెపల్లి వెంకటేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.  అనుమానితులైన గజ్జెల్లి తిరుపతి, గజ్జెల్లి రాజన్న, రాజన్న కుమారుడు గజ్జెల్లి సాయితేజలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top