వైరల్‌: దాడి చేసింది మేజిస్ట్రేటేనా!  | Videos Of Magistrate Attacking With Brick Went Viral In Tirupati | Sakshi
Sakshi News home page

దాడి చేసింది మేజిస్ట్రేటేనా! 

Jul 17 2020 8:17 AM | Updated on Jul 17 2020 8:21 AM

Videos Of Magistrate Attacking With Brick Went Viral In Tirupati - Sakshi

వెంకటరెడ్డి ఇంటిముందు పేర్చిన ఇటుకలు

సాక్షి, తిరుపతి : సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ ఎస్‌.రామకృష్ణ ఇటుకతో దాడి చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రోడ్డుపైనా కట్టెలు విసిరేస్తూ కనిపించిన ఈ సంఘటన బి.కొత్తకోటలో మంగళవారం ఉదయం జరిగింది. దీనిపై బుధవారం రాత్రి రెండు కేసులు నమోదయ్యాయి. మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ఫిర్యాదుతో 10 మందిపై కేసు నమోదుకాగా రిటైర్డ్‌ వీఆర్‌ఓ ఫిర్యాదుతో మేజిస్ట్రేట్‌ ఎస్‌.రామకృష్ణ, అతని కుమారుడిపై కేసులు నమోదు చేశామని బి.కొత్తకోట ఎస్‌ఐ బి.సునీల్‌కుమార్‌ తెలిపారు.

మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తన ఇంటి పనుల కోసం ఇటుకలు, సామగ్రిని నిల్వ చేసుకొని ఉండగా రిటైర్డ్‌ వీఆర్‌ఓ జే.వెంకటరెడ్డి, అతని బావమర్ది శంకర్‌రెడ్డి, మరో 9 మంది కలిసి మంగళవారం ఉదయం 2 వేల ఇటుకలను తరలిస్తుండగా అడ్డుకొని ప్రశ్నించగా తనపై దాడి చేసి నెట్టేశారని, భుజంపై గాయమైందని మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకటరెడ్డి(65), అతని బావమర్ది శంకర్‌రెడ్డి, మరో 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేశారు.  

రామిరెడ్డి కాలనీలోని తన ఇంటి ముందున్న రోడ్డును మేజిస్ట్రేట్‌ రామకృష్ణ ఆక్రమించి నిర్మాణం చేసేందుకు  ఇటుకలు, కట్టెలను అడ్డంగా పెట్టి ఇంటిలోకి రాకపోకలను నిరోధించడంతో వాటిని తొలగించాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదని రిటైర్డ్‌ వీఆర్‌ఓ జే.వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. కంబాలపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి, బయ్యారెడ్డి, మరికొందరు కూలీలతో ఇటుకలను తొలగిస్తుండగా మేజిస్ట్రేట్‌ రామకృష్ణ అసభ్య పదజాలంతో తిడుతూ ఇటుకతో తన బావమర్ది శంకర్‌పై దాడి చేశారని తెలిపారు. అలాగే అతని కుమారుడు వంశీకృష్ణ కట్టెతో కూలీలపై దాడి చేశారని పేర్కొన్నారు.  

అసలు కారణం ఇదే..
సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తనకు, వెంకటరెడ్డి ఇంటికి మధ్యలో 544 చదరపు అడుగులను మారెడ్డి జగదీష్‌రెడ్డి నుంచి రూ.3.50 లక్షలకు విక్రయ ఒప్పందం చేసుకున్నారు. ఇది వివాదానికి దారితీసింది.  

వీడియోల్లో బట్టబయలు 
మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటనల్లో మేజిస్ట్రేట్‌ రామకృష్ణ వాదనకు బుధవారం విస్తృత ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేసులు నమోదయ్యాక గురువారం ఉదయం రామకృష్ణ కనిపిస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. వీటిలో మేజిస్ట్రేట్‌ రామకృష్ణ స్వయంగా రోడ్డుపైకి కొ య్యలను విసిరేయడం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వీడియోలో కుడి చేతిలో ఇటుక పట్టుకుని అసభ్య పదజాలంతో తిడుతూ దాడి చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో 100కు ఫోన్‌ చేయండి అంటూ రామకృష్ణ చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement