breaking news
Mandal Revenue Office
-
వైరల్: దాడి చేసింది మేజిస్ట్రేటేనా!
సాక్షి, తిరుపతి : సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్ ఎస్.రామకృష్ణ ఇటుకతో దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపైనా కట్టెలు విసిరేస్తూ కనిపించిన ఈ సంఘటన బి.కొత్తకోటలో మంగళవారం ఉదయం జరిగింది. దీనిపై బుధవారం రాత్రి రెండు కేసులు నమోదయ్యాయి. మేజిస్ట్రేట్ రామకృష్ణ ఫిర్యాదుతో 10 మందిపై కేసు నమోదుకాగా రిటైర్డ్ వీఆర్ఓ ఫిర్యాదుతో మేజిస్ట్రేట్ ఎస్.రామకృష్ణ, అతని కుమారుడిపై కేసులు నమోదు చేశామని బి.కొత్తకోట ఎస్ఐ బి.సునీల్‌కుమార్ తెలిపారు. మేజిస్ట్రేట్ రామకృష్ణ తన ఇంటి పనుల కోసం ఇటుకలు, సామగ్రిని నిల్వ చేసుకొని ఉండగా రిటైర్డ్ వీఆర్ఓ జే.వెంకటరెడ్డి, అతని బావమర్ది శంకర్‌రెడ్డి, మరో 9 మంది కలిసి మంగళవారం ఉదయం 2 వేల ఇటుకలను తరలిస్తుండగా అడ్డుకొని ప్రశ్నించగా తనపై దాడి చేసి నెట్టేశారని, భుజంపై గాయమైందని మేజిస్ట్రేట్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకటరెడ్డి(65), అతని బావమర్ది శంకర్‌రెడ్డి, మరో 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేశారు. రామిరెడ్డి కాలనీలోని తన ఇంటి ముందున్న రోడ్డును మేజిస్ట్రేట్ రామకృష్ణ ఆక్రమించి నిర్మాణం చేసేందుకు ఇటుకలు, కట్టెలను అడ్డంగా పెట్టి ఇంటిలోకి రాకపోకలను నిరోధించడంతో వాటిని తొలగించాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదని రిటైర్డ్ వీఆర్ఓ జే.వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. కంబాలపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి, బయ్యారెడ్డి, మరికొందరు కూలీలతో ఇటుకలను తొలగిస్తుండగా మేజిస్ట్రేట్ రామకృష్ణ అసభ్య పదజాలంతో తిడుతూ ఇటుకతో తన బావమర్ది శంకర్‌పై దాడి చేశారని తెలిపారు. అలాగే అతని కుమారుడు వంశీకృష్ణ కట్టెతో కూలీలపై దాడి చేశారని పేర్కొన్నారు. అసలు కారణం ఇదే.. సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్ రామకృష్ణ తనకు, వెంకటరెడ్డి ఇంటికి మధ్యలో 544 చదరపు అడుగులను మారెడ్డి జగదీష్‌రెడ్డి నుంచి రూ.3.50 లక్షలకు విక్రయ ఒప్పందం చేసుకున్నారు. ఇది వివాదానికి దారితీసింది. వీడియోల్లో బట్టబయలు మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటనల్లో మేజిస్ట్రేట్ రామకృష్ణ వాదనకు బుధవారం విస్తృత ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేసులు నమోదయ్యాక గురువారం ఉదయం రామకృష్ణ కనిపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో మేజిస్ట్రేట్ రామకృష్ణ స్వయంగా రోడ్డుపైకి కొ య్యలను విసిరేయడం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వీడియోలో కుడి చేతిలో ఇటుక పట్టుకుని అసభ్య పదజాలంతో తిడుతూ దాడి చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో 100కు ఫోన్ చేయండి అంటూ రామకృష్ణ చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. -
పింఛన్.. బాంచన్..
దరఖాస్తు అందజేతకు ఓ వికలాంగుడి యాతన పల్లెల్లో..పట్టణాల్లో ఏ నోట విన్నా.. ఏ వీధిలోకి వెళ్ళినా..ఏ కార్యాలయాన్ని దర్శించినా..పింఛన్లు..ఆహార భద్రత కార్డుల గురించే వినిపిస్తుంది. అర్హులైన లబ్ధిదారులంతా తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చి బస్సు దాటిపోతుందని పరేషాన్లో దరఖాస్తు ఫారాల కవర్‌ను నోటితో పట్టుకొని రోడ్డుపై వేగంగా పాక్కుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యం అక్కడున్న వారిని కలిచి వేసింది. పాపన్నపేట మండలం కొంపల్లి గ్రామానికి చెందిన కుర్మసాయిలు పుట్టుకతోనే వికలాంగుడు. కిష్టమ్మ, సంగయ్య దంపతులకు పెద్ద కుమారుడు. ఇంతకి అసలు విషయం ఏమిటంటే దరఖాస్తు చేసుకునేందుకు మండల కార్యాలయానికి వచ్చిన సాయిలు రోజంతా కార్యాలయం ముందు పడిగాపులు కాసి రాత్రి అధికారుల వద్దకు వెళ్తే..దరఖాస్తు చేసుకునేది ఇక్కడ కాదు..మీ ఊరిలోనేనంటూ.. చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో తిండి తిప్పలు లేని సాయిలు ఉన్న బస్సుపోతే రాత్రంతా శివరాత్రేనంటూ బస్సుకోసం ఇలా పరుగులు పెట్టాడు. గతంలో సాయిలుకు ట్రైసైకిల్ ఇచ్చినా..అది చెడిపోయింది. తిరిగి అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా..అతని మొర అరణ్యరోదనే అయ్యింది. - పాపన్నపేట