దొంగ.. పోలీస్‌ ఆట !

Victim Parents Complaint On Gold Robbery Case To HRC In Guntur - Sakshi

ఆరు గోల్డ్‌ కాయిన్స్‌ కోసం పోలీసుల ఆరా

అక్రమంగా కేసులో ఇరికించారంటున్న తల్లిదండ్రలు

పోలీసులపై హెచ్‌ ఆర్సీలో ఫిర్యాదు

దోపిడీ కేసులో తమ బిడ్డను తప్పించేందుకు పోలీసులు డబ్బును డిమాండ్‌ చేశారన్న తల్లిదండ్రుల వాదన ఒకవైపు. మేము కేవలం రికవరీ కాని మొత్తాన్ని అడిగామంటున్న పోలీసుల వాదన మరోవైపు. ఈ క్రమంలోనే అన్యాయంగా మా అబ్బాయిని కేసులో ఇరుకించడమే కాకుండా మాతో బేరాలు సాగిస్తున్నారంటూ నిందితుడి తల్లిదండ్రులు బుధవారం (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. గుంటూరులోని కోబాల్డ్‌ పేటకు చెందిన కర్నాటక శివాజీ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పతుండేవాడు. మే నెలలో స్నేహితుడితో కలిసి ఒంటరిగా వెళ్తున్న మహిళ వద్ద ట్రాలీ బ్యాగ్‌ లాక్కుని పరారయ్యాడు.

గుంటూరు: దోపిడీ కేసులో నుంచి తప్పించేందుకు డబ్బు డిమాండ్‌ చేశారంటూ ఆ కేసులో పట్టుబడిన యువకుడి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. దోపిడీ కేసులో రికవరీ కోసం రూ.1.10 లక్షలు అడిగితే, లంచం అడిగినట్టు ఆరోపణలు చేస్తున్నారంటూ పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఆ దోపిడీ కేసు పోలీస్‌శాఖలో సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని కోబాల్డ్‌పేటకు చెందిన కర్ణాటక శివాజీ అలియాస్‌ శివుడు అలియాస్‌ ముడుసు చిన్న చిన్న దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుండేవాడు. అతని స్నేహితుడు రామిరెడ్డితోట 5వలైనుకు చెందిన పెనువర్తి శరత్‌కుమార్‌ అలియాస్‌ శరత్, సీతానగర్‌ 5వలైనుకు చెందిన షేక్‌ గుల్జార్‌ అలియాస్‌ మున్నాలతో కలిసి ఈ ఏడాది మే 16న ద్విచక్రవాహనంపై బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ తెల్లవారుజామున బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగును లాక్కొని పరారయ్యారు.

విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీ బ్యాగులో ఉన్న బట్టలు, పుస్తకాలతోపాటు, 300 గ్రాముల బంగారపు కాయిన్స్‌ను పోలీసులు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గుల్జార్‌ తీసుకున్న రూ.1.10 లక్షల విలువ చేసే ఆరు బంగారు కాయిన్లు రికవరీ కాకపోవడంతో వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పారు. అయితే తమ కుమారుడికి దొంగతనం చేయాల్సిన అవసరం లేదని, అన్యాయంగా కేసులో ఇరికించారంటూ హైదరాబాద్‌లోని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. నామమాత్రపు కేసుతో బయటపడేసేందుకు పోలీసులు రూ.3 లక్షలు అడిగి చివరకు రూ.1.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

ఏసీబీ అధికారుల విచారణ
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారిన దోపిడీ కేసుకు సంబంధించి బుధవారం గుంటూరు ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో, సీఐ ఫిరోజ్‌ రంగంలోకి దిగారు. చోరీ చేశాడని పోలీసుల అభియోగం మోపిన యువకుల తల్లిదండ్రులను విచారించారు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌ శాంతో తెలిపిన వివరాల ప్రకారం ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు క్రైం పోలీసులు బాధితుల నుంచి నగదు వసూలు చేస్తున్నారన్న విషయంపై బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి విచారించారు. చోరీ కేసుకు సంబంధించి మే 18వ తేదీ అర్ధరాత్రి క్రైం పోలీసులు వచ్చి అడగ్గానే తమ కుమారుడు దొంగిలించిన రెండు బంగారు కాయిన్స్‌ను పోలీసులకు అప్పగించామని చోరీకి పాల్పడిన ముగ్గురిలో ఒకడైన రామిరెడ్డితోటకు చెందిన శరత్‌కుమార్‌ తల్లిదండ్రులు చెప్పారు.

అయితే పోలీసులు మిగతా రెండు కాయిన్ల రికవరీ నిమిత్తం రూ.1.50 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో అప్పు చేసి మరీ కట్టానని శరత్‌కుమార్‌ తండ్రి రాంబాబు తెలిపాడు. అయితే కేసు నుంచి పూర్తిగా బయటపడేయాలంటే మరో రూ.1.50 లక్షలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేసులో మరో నిందితుడైన సీతానగర్‌కు చెందిన గుల్జార్‌ మహ్మద్‌ తల్లిదండ్రులు రమీజున్, ఇంతియాజ్‌ బాషాలను కూడా ఏసీబీ అధికారులు విచారించగా వారు కూడా పోలీసులు తమను పెట్టీ కేసు పెట్టి బయటపడవేసేందుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని కొత్తపేట సీఐ వంశీధర్, ఎస్‌ఐ నారాయణ, సీసీఎస్‌ ఏఎస్‌ఐ కోటేశ్వరరావు, సీసీఎస్‌ సీఐ కరీం వేధించారని ఆరోపించారు.

రివకరీలో భాగంగానే...
విచారణ చేపడుతున్న అధికారులు ఉద్దేశపూర్వకంగా డబ్బు అడిగిన మాట అవాస్తవమని చెప్పారు. వారు దోపిడీ చేసిన బంగారు కాయిన్లలో కొన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని, వాటిని రికవరీ చేసేందుకు డబ్బు అడిగారని తెలిపారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.  – అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top