'చిన్న'తప్పే.. పెద్దశిక్ష!

Vehicle Owner Remand in Minor Bike Accident First Case in Jogulamba - Sakshi - Sakshi

పిల్లలకు వాహనాలు ఇస్తే తప్పదు జైలుశిక్ష

ఓ మైనర్‌ చేసిన ప్రమాదానికి  వాహన యజమానికి రిమాండ్‌

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటి కేసు

తల్లిదండ్రుల్లారా.. మేల్కోండి

వారికి పట్టుమని పదేళ్లు లేకుంటాయ్‌.. కానీ బైక్‌ను మాత్రం రయ్‌.. రయ్‌మని గిరిగిరా తిప్పేస్తుంటారు.. మరోదిక్కు వెనక ఓ తండ్రి తాపీగా కూర్చొని.. తమ పిల్లాడికి బండి ఇచ్చి నడిపిస్తుంటాడు.. ఇలా చిన్న పిల్లలు ద్విచక్రవాహనాలను తీసుకుని ఇష్టానుసారంగా నడిపిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు వారే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఫలితంగా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంటుంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరిగిపోయాయి.. వీటిపై దృష్టిసారించిన పోలీస్‌ యంత్రాంగం బాలురు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైనా.. పోలీసులకు పట్టుబడినా సంబంధిత బండి యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు..

గద్వాల క్రైం: పాలబుగ్గలా పసి మొగ్గలు హద్దులు దాటుతున్నారు. బడిలో పాఠ్యపుస్తకాలతో.. ఆటలతో హుషారుగా చదువుకోవాల్సిన సమయంలో.. ఆకతాయి చేష్టలతో రోడ్లపై ద్విచక్రవాహనాలు నడుపుతూ పాదచారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఆకతాయి చేష్టలతో వాహనాన్ని అత్యంత వేగంతో నడిపి దానిని అదుపు చేసే సామర్థ్యం లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో అటు వాహనదారులు, ఇటు పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. 

అతి గారాబంతో..
పిల్లలను అదుపు చేయాల్సిన పెద్దలు సైతం వారిపై పెంచుకున్న ప్రేమతో వారిని దండించడంలో వెనకడుగు వేస్తున్నారు. అతిగారాబం చూపుతూ.. పిల్లలు వాహనాలు నడపడం ఓ స్టేటస్‌ భావిస్తూ.. పిల్లలు చేసే పనులకు అడ్డు చెప్పడం లేదు. మరి కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు వాహనాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసుల తనిఖీలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన సందర్భంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నా ఫలితం లేకపోతుంది. గద్వాల జిల్లాకేంద్రంలో ఇప్పటి వరకు 200 మంది బాలురకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ పోలీసులు ఇచ్చారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్‌ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు.

నిబంధనల ప్రకారం..
సాధరణంగా వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రవాణా శాఖ నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలి. రోడ్డు నియమ, నిబంధనలు పాటించాలి. కానీ బాలురకు ఇందులో ఏ ఒక్క దానిపైనా అవగాహన ఉండదు. అయినా వాహనాలపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్, ట్రాఫిక్‌ ఎస్‌ఐ నింబధనలపై విస్తృత ప్రచారం కల్పిస్తూ జరిమానాలు విధిస్తున్నారు.

              వివరాలు వెల్లడిస్తున్న పట్టణ ఎస్‌ఐ
ఇదిగో సాక్ష్యం..
గద్వాలలోఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంటకు చెందిన ఓ బాలుడు(15) గద్వాలకు చెందిన కాపు శ్రీనివాస్‌రెడ్డి ద్విచక్రవాహనాని ఇప్పించుకొని పట్టణంలోని సుంకులమ్మమెట్‌ ప్రాంతంలో వాయువేగంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన పబ్బతి లక్ష్మీనారాయణ(60) ఆ దారి వెంట నడుస్తూ వెళ్తుండగా బాలుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ప్రమాదం చేసింది బాలుడని గుర్తించారు.దీంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడిని బాల నేరస్థుడిగా గుర్తించి బాలసదన్‌కు తరలించారు. బాలుడికి వాహనం ఇచ్చిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

కఠిన చర్యలు..
బాలురు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ఎవరైనా అతిక్రమించి ప్రమాదాలకు కారణమైనా, పోలీసులకు చిక్కినా తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. తప్పు చేస్తూ దొరికిపోతే ఎంతవారిపైనైనా కఠిన చర్యలు తప్పవు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top