‘అప్పుడు వారి ముఖం, బట్టలు రక్తంతో తడిచిపోయాయి’

US Teen Brutally Killed Inside Tunnel By Gang - Sakshi

అరియానా ఫ్యూన్స్‌-డియాజ్‌.. పద్నాగేళ్ల అమ్మాయి.. గత నెల 11న తాను ఆశ్రయం పొందే యూత్‌ గ్రూప్‌ హోం నుంచి పారిపోయింది. అనంతరం అదే నెల17న ఇంటికి వెళ్లేందుకు తన తల్లికి పరిచయస్తుడైన ఓ వ్యక్తిని కలిసి బెన్నింగ్‌ మెట్రో స్టేషన్‌లో తనను దించాల్సిందిగా కోరింది. అయితే మార్గ మధ్యలో వీరి కారును అడ్డగించిన పదిహేను మందితో కూడిన ఓ గుంపు అరియానా వెంట ఉన్న వ్యక్తిని బయటికి ఈడ్చిపారేసింది. అనంతరం అతడిని ఓ ఇంటిలోకి తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టారు. అర్ధనగ్నంగా అతడిని నిల్చోబెట్టి కాసేపు హింసించిన తర్వాత 500 డాలర్లు, ఏటీఎమ్‌ కార్డులు లాక్కున్నారు.

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అరియానా ఆ వ్యక్తిని కొట్టవద్దంటూ దుండగులను బతిమిలాడటంతో అతడిని వదిలిపెట్టారు. అయితే అరియానా చేత అతడిని కిడ్నాప్‌ చేయించాలని భావించిన ఆమె గ్యాంగ్‌కు ఈ విషయం తెలియడంతో అరియానాపై అనుమానం వచ్చింది. ఈ విషయంతో పాటుగా తమ గురించి కూడా పోలీసులకు చెబుతుందోమోనన్న అనుమానం వారిని వెంటాడింది. దీంతో ఎప్పటికైనా ఆమెతో తమకు ప్రమాదం పొంచి ఉందని భావించిన గ్యాంగ్‌ సభ్యులు ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రమంలో ఏప్రిల్‌ 18న అరియానాను జనసమ్మర్దం తక్కువగా ఉండే ఓ అపార్టుమెంటులోకి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న టన్నెల్‌లోకి లాక్కెళ్లి పాశవికంగా హత్య చేశారు. అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎస్కోబార్‌, ఫ్యూంటెస్‌ పోన్స్‌ అనే టీనేజర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. అరియానాను వివస్త్రగా మార్చిన ఎస్కోబార్‌.. చెక్క బ్యాట్‌, బేస్‌బాల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత ఫ్యూంటెన్స్‌ కత్తితో ఆమెను దారుణంగా గాయపరిచాడు. ఈ తతంగాన్నంతా చూస్తున్న మరో వ్యక్తి వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ఈ నేరంలో వీరికి హెర్నాండెజ్‌ అనే మరో పద్నాగేళ్ల బాలిక సహకరించింది.

విచారణలో భాగంగా అరియానా హత్యలో తనకు భాగం లేదన్న హెర్నాండెజ్‌.. ఆరోజు తను టన్నెల్‌ బయట నిల్చుని ఉన్నానని పేర్కొంది. ఆ సమయంలో ఆడ మనిషి అరుపులు విన్నానని.. కాసేపటి తర్వాత ఎస్కోబార్‌, ఫ్యూంటెన్స్‌ బయటికి వచ్చారని చెప్పింది. అప్పుడు వారి ముఖం, బట్టలు పూర్తిగా రక్తంతో తడిచిపోవడంతో తనకు భయం వేసిందని పేర్కొంది. అయితే ఉద్దేశ పూర్వకంగానే హెర్నాండెజ్‌ టన్నెల్‌ బయట నిల్చుని హంతకులకు సహకరించిందని పోలీసులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సమీపంలో దొరికిన కత్తి, అపార్టుమెంటులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించగలిగామని పేర్కొన్నారు. అయితే ఈ హత్యలో భాగస్వామ్యమైన మరో వ్యక్తి జాడ ఇంతవరకు తెలియలేదని, త్వరలోనే ఆ నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top