
జన్ని సుధీర్ (ఫైల్) వినయవర్మ (ఫైల్)
స్నేహితుడి పుట్టిన రోజు సంబరాల నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అల్లిపురం(విశాఖ దక్షిణం): అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపారు... అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు... ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. సిరిపురం రోడ్డులోని అపోలో ఆస్పత్రి సమీపంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకుకు చెందిన జన్ని సుధీర్ (21), పెందుర్తి మండలం యలమతోటకు చెందిన పెనుమత్స వినయవర్మ (22) చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ అరకులోని సెయింట్ జోషెఫ్ పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం నగరంలోని బుల్లయ్యకాలేజీలో సుధీర్ డిగ్రీ చదువుతున్నాడు. నగరంలోని ఓ కళాశాలలో వినయవర్మ ఎమ్మెస్సీ చదువుతున్నాడు. వీరిలో సుధీర్ నగరంలోని మేఘాలయ హోటల్ దరి శ్రీ సాయి సూర్య బోయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో వారితోపాటు స్కూల్ స్థాయిలో కలిసి చదువుకున్న స్నేహితుడు పుట్టినరోజు వేడుకను శనివారం రాత్రి బీచ్‌లో నిర్వహించారు. దీంతో హాస్టల్ నుంచి సుధీర్, స్వగ్రామం యలమతోట నుంచి వినయమర్మ బీచ్‌కు చేరుకుని అక్కడ స్నేహితులందరితో కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. కొద్ది సేపటి తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో సుధీర్ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లేందుకు బీచ్ నుంచి సుధీర్, వినయవర్మ బయలుదేరారు. స్నేహితుడి బైక్‌పై జగదాంబ నుంచి సిరిపురం వైపు వేగంగా వస్తుం డగా... బైక్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో అపోలో ఆస్పత్రి దరి డివైడర్ మధ్యలోని సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న పెనుమత్స వినయవర్మ తల విద్యుత్ స్తంభానికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. జన్ని సుధీర్ కింద పడిపోవటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతోపాటు కుడికాలు విరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఎదురుగా గల అపోలో ఆస్పత్రి సిబ్బంది చికిత్స నిమిత్తం స్ట్రక్చర్‌పై తీసుకెళ్తుండగా మరణించాడు. దీంతో స్థానికులు సుధీర్ సెల్‌ఫోన్ నుంచి అతని స్నేహితుడు టి.వెంకటగణేష్‌కు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు విషయం తెలియజేసి, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఆదివారం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే పుట్టిన రోజు వేడుకుల తర్వాత సుధీర్, వినయ్ ఎక్కడకు వెళ్లారో తమకు తెలియదని... ప్రమాదం విషయం తెలిసన తర్వాతే వారు బయటకు వెళ్లినట్లు తెలిసిందని వారి స్నేహితుడు టి.వెంకటగణేష్ చెబుతున్నాడు. దీంతో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇంటి ఆవరణలోనే సమాధి చేస్తా...
సుధీర్, వినయవర్మ మృతదేహాలకు ఆదివారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సుధీర్ తండ్రి జన్ని సోమన అరకులో రైతుకూలీగా పనిచేస్తుండగా తల్లి విజయ సాలూరులో టీచరుగా పనిచేస్తున్నారు. కుమారుడి చదువు పూర్తయితే అందొస్తాడనుకుంటే... ఇలా అర్ధంతరంగా తనువు చాలించాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని... వెంటనే బైక్‌పై అరకు నుంచి వచ్చేశానని సోమన విలపిస్తూ చెప్పారు. తన కొడుకు మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టి, సమాధి నిర్మించుకుంటానని చెప్పడం అక్కడి వారిని కలిచివేసింది. వినయవర్మ తల్లిదండ్రులు శివప్రసాద్, పార్వతి కుమారుడి మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. నగరంలో పని ఉందని ఇంటి నుంచి శనివారం బయలుదేరిన కుమారుడు విగతజీవిగా మారాడని గుండెలవిసేలా రోదించారు.