ఇద్దరు మహిళా రైతుల ఆత్మహత్యాయత్నం

Two Women Farmers Attempt To Suicide - Sakshi

వ్యవసాయ భూముల వివాదంలో మనస్తాపం

వేర్వేరు ప్రాంతాల్లో ఘటన

గూడూరు : పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మరో చోట తమ వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మరో మహిళా రైతు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

బాధితుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని చిన్నఎల్లాపురం శివారు వెంగంపేటకు చెందిన మంగ్యానాయక్, భద్రమ్మ దంపతులు 15ఏళ్ల క్రితం ఊట్ల గ్రామశివారు సరస్వతి నగర్‌లో రెండెకరాల పోడు భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు ఆ పోడు భూమిలో విత్తనాలు వేసేందుకు పరిసర రైతులతో పాటు దుక్కి దున్నుతున్నారు. ఆ క్రమంలో గురువారం ఫారెస్టు అధికారి మంగతయారుతో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు.

ఈ భూమి అటవీశాఖకు చెందిందని, వ్యవసాయం చేయొద్దని అడ్డుకున్నారు. దీంతో ఆవేదనకు గురైన బానోతు భద్రమ్మ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న భర్త మంగ్యానాయక్, ఇతర రైతులు కలిసి ఆమెను వెంటనే గూడూరు సీహెచ్‌సీకి తరలించారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు.

కమలాపూర్‌లో.. 

కమలాపూర్‌(హుజూరాబాద్‌): తమ భూమిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, ఆ భూమిని తమ పేరిట పట్టా చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కమలాపూర్‌ మండలం అంబాలకు చెందిన మహిళా రైతు బోయిని సమ్మక్క ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

బాధితురాలి కథనం ప్రకారం.. బోయిని సమ్మక్క–సారయ్య దంపతులకు అంబాలలో 1.36 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, తన వద్ద భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టా చేయడం లేదని ఆరోపించింది.

తమ భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా దాడి చేస్తునారని ఆరోపించింది. భూమిని తమ పేరిట పట్టా చేసి న్యాయం చేయాలంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దార్‌ సత్యనారాయణయాదవ్‌ను వివరణ కోరగా.. సమ్మక్క భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదని, ఏ ఆధారం లేనిదే తాము పట్టా చేయలేమని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top