పోలీసులపై మావోల దాడి

Two policemen, DD cameraman killed in Naxal attack in Chhattisgarh - Sakshi

ఎస్సై, కానిస్టేబుల్, దూరదర్శన్‌ కెమెరామన్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఘటన  

చర్ల/చింతూరు(రంపచోడవరం): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం బిజాపూర్‌ జిల్లాలో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను పొట్టనబెట్టుకోగా తాజాగా దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు పన్నిన వ్యూహంలో చిక్కుకుని ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతి చెందారు. జిల్లాలోని ఆరన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నీలవాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం నీలవాయి ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. దీంతో ఆరన్‌పూర్‌ స్టేషన్‌ ఎస్సై రుద్రప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి బయలుదేరారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రక్రియపై డాక్యుమెంటరీ తీసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల దూరదర్శన్‌ ఛానెల్‌ బృందం  వారి వెంట ఉంది. అక్కడికి సుమారు 200 మీటర్ల దూరంలోనే కాపుకాసి ఉన్న దాదాపు 100 మంది మావోలు వారిపైకి కాల్పులు ప్రారంభించారు.

దాదాపు గంటసేపు చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఎస్సై రుద్ర ప్రతాప్, కానిస్టేబుల్‌ మంగళ్‌రాంతో పాటు దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహు మృతి చెందినట్టు నక్సల్స్‌ ఆపరేషన్‌ డీఐజీ సుందర్‌రాజన్‌ తెలిపారు. ఈ ఘటనపై స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డీఎం అవస్థి మాట్లాడుతూ..‘పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సహచరులను మావోయిస్టులు ఎత్తుకుపోవడాన్ని బట్టి ఆ ఇద్దరూ మరణించి ఉంటారని భావిస్తున్నాం. ఘటన ప్రాంతంలో అమర్చిన సుమారు 10 మందుపాతరలను నిర్వీర్యం చేశాం.

ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కాంట్రాక్టర్లను, కూలీలను బెదిరించేందుకే తప్ప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావించటం లేదు’ అని అన్నారు. సంఘటన ప్రాంతానికి సీఆర్‌పీఎఫ్, ఎస్టీఎఫ్, డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డులు హుటాహుటిన తరలి వెళ్లారన్నారు. ఈ ఘటనను హోం మంత్రి రాజ్‌నాథ్‌ ఖండించారు. ‘మావోల చర్యను ప్రభుత్వం తీవ్రమైందిగా పరిగణిస్తోంది’ అని అన్నారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన బస్తర్, కాంకర్, సుక్మా, దంతేవాడ, నారాయణ్‌పూర్, కొండగావ్, రాజ్‌నందన్‌గావ్‌ల్లో ఉన్న 18 నియోజకవర్గాల్లో నవంబర్‌ 12వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఆ గుంత కాపాడింది
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో దూరదర్శన్‌ బృందంలోని రిపోర్టర్‌ ధీరజ్‌ కుమార్, లైట్‌ అసిస్టెంట్‌ మొర్ముక్త్‌ శర్మ సురక్షితంగా బయటపడ్డారు. ‘మా బృందంలోని ముగ్గురమూ మూడు బైక్‌లపై ఉన్నాం. నక్సల్స్‌ బుల్లెట్లకు ముందున్న బైక్‌పై ఉన్న సాహు గాయపడ్డాడు. ఆయన పడిపోవడం చూసిన వెంటనే మేం నక్సల్స్‌ దాడిగా అనుమానించి వెంటనే పక్కనున్న గుంతలోకి దూకేశాం. దీంతో బుల్లెట్ల నుంచి తప్పించుకున్నాం’ అని మొర్ముక్త్‌ శర్మ తెలిపారు.

కాగా,  కెమెరామన్‌ సాహు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ హామీ ఇచ్చారు. దూరదర్శన్‌ తరఫున రూ.10 లక్షలు, జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలను అందజేస్తామన్నారు. సాహు భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీనిచ్చారు. కాగా, ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాకు చెందిన అచ్యుతానంద సాహు దూరదర్శన్‌లో 2013లో చేరారు. ఈయనకు రెండేళ్ల క్రితమే వివాహమయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top