అప్పు ఎగ్గొట్టేందుకు ఆ మహిళ ఎంత పని చేసిందో..!

Two Man Killed In Clash Between For Asking Money - Sakshi

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైల్వేట్రాక్‌పై మృతదేహాలు 

నిందితులను పట్టించిన పోస్టుమార్టం నివేదిక  

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో సంచలనం సృష్టించిన కొటిపి జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధ దంపతులను హత్య చేసి.. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు ఆత్మహత్యగా చిత్రీకరించిన ఓ కిలాడి మహిళతో పాటు నలుగురు నిందితులను హిందూపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. ఈ నెల 15న హిందూపురం మండలం కొటిపి రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి మృతులుగా హిందూపురం పట్టణంలో అహ్మ దాబాద్‌కు చెందిన గీతాబాయి, నాగభూషణంరావు దంపతులుగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసును హిందూపురం పోలీసులు తీసుకున్నారు. మృతుల ఇంటి పై పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న సుశీలమ్మ అప్పు ఎగ్గొట్టేందుకు హత్యకు పథక రచన చేసింది. హిందూపురానికి చెందిన ఆంజనేయులు, పవన్‌కుమార్, నారాయణస్వామి, కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాకు చెందిన తాడి నాగభూషణ సహకారంతో హత్య చేసినట్లు తేలింది.  

అప్పు ఎగ్గొట్టాలని కడతేర్చేశారు.. 
పామిడి మండలానికి చెందిన నాగభూషణంరావు, గీతాబాయి దంపతులు మూడేళ్ల క్రితం హిందూపురం వచ్చి స్థిరపడ్డారు. అహ్మదాబాద్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసముంటూ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన సుశీలమ్మ వీరి ఇంటి పై పోర్షన్‌లో అద్దెకు ఉంటోంది. సుశీలమ్మ భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా.. మరో నిందితుడైన నాగభూషణంతో సహజీవనం చేస్తోంది. అవసరాల కోసం గీతాబాయి దంపతుల నుంచి రూ. 4 లక్షలు అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో తరచూ గీతాబాయి గొడవ పడేది. అయినా కూడా అప్పు చెల్లించడానికి సుశీలమ్మ ససేమిరా అంటూ వస్తోంది. అయితే గీతాబాయి తరచూ అప్పు అడగటాన్ని సుశీలమ్మ అవమానంగా భావించింది.

దీంతో ఎలాగైనా సుశీలమ్మను కడతేర్చాలని భావించి నాగభూషణంతో కలిసి హత్యకు పథక రచన చేసింది. పథకంలో భాగంగా అప్పును చెల్లిస్తామని నమ్మబలికి గీతాబాయి, నాగభూషణరావులను ఓ ఆటోలో పిలుచుకుని సంజీవరాయునిపల్లి దాటగానే కంపచెట్లలోకి తీసుకెళ్లి గొంతుబిగించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొటిపి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యలుగా గుర్తించారు. పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో హిందూపురం రూరల్‌ సీఐ శ్రీనివాసులు, వన్‌టౌన్‌ సీఐలు ధరణికిశోర్, బాలమద్దిలేటిలు బృందంగా ఏర్పడి కిలాడి లేడీ సుశీలమ్మతో పాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. అతి తక్కువ సమయంలోనే కేసు ఛేదించడంపై పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top