ఆగిన అన్నదాతల గుండె 

Two Farmers suicide With Heart Attack In Kurnool - Sakshi

సాక్షి, పగిడ్యాల(కర్నూలు): వ్యవసాయం కలిసి రాకపోవడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడం.. వెరసి ఒకే గ్రామంలో ఇద్దరు రైతులు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని ప్రాతకోట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఉద్దగిరి కృష్ణ(50) ఎకరా సొంత పొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవాడు.  ఏటా పంటలు సాగు చేస్తున్నా వచ్చిన దిగుబడి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు.  ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులతోపాటు కుటుంబ ఖర్చుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఆందోళనకు గురైన కృష్ణ  ఆదివారం గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా కోలుకోలేక మరణించాడు. ఇదే గ్రామా నికి చెందిన బోయ నాగేష్‌(66) ఉదయం శేషగిరిరావు పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి గుండెపోటుకు గురై మరణించాడు. ఒకే రోజు ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  

బాధిత కుటుంబాలకు సిద్ధార్థరెడ్డి పరామర్శ.. 
బాధిత కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. ఉద్దగిరి కృష్ణ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల   ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, నాయకులు కురుమన్న, అంకిరెడ్డి, మల్లయ్య, స్వాములు తదితరులున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top