కాల్‌ డేటా చుట్టూ విచారణ

Trial around call data - Sakshi

కోర్టులో పిటిషన్లు వాయిదా వేసిన మేజిస్ట్రేట్‌

నిందితునికి మళ్లీ వైద్య పరీక్షలు

ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యుని ధ్రువీకరణ

సాక్షి, విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణ నాలుగోరోజు బుధవారం ప్రధానంగా కాల్‌డేటా ఆధారంగా సాగింది. నిందితుడు శ్రీనివాసరావునునూ విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి 48 గంటలకో సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పుకొస్తూ మంగళవారం పోలీసులు చేసిన హడావుడి, మీడియా కంటపడిన వెంటనే నిందితుడు ‘తనకు ప్రాణ హాని ఉంది..తనను చంపేస్తున్నా’ రంటూ చేసిన హంగామా ఓ తమాషాగా మారింది. వైద్య పరీక్షలు నిర్వహించి కనీసం 24 గంటలు కూడా జరక్కుండానే బుధవారం నిందితునికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్‌ రేట్, సుగర్‌ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని, చాలా ఆరోగ్యంగా ఉన్నాడని పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రోజూ మాదిరిగానే బుధవారం కూడా సీపీ మహేష్‌చంద్ర లడ్డా, ఫకీరప్ప స్థానంలో కేసు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న జోన్‌–2 డీసీపీ నయీమ్, సిట్‌ అధికారి బీవీఎస్‌ నాగేశ్వరరావులు ఉదయమే ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

కాల్‌డేటా ఆధారంగా తీసుకొచ్చిన  సాకు‡్ష్యలను  విచారించారు. తొలుత వారి నుంచి వాంగ్మూలం తీసుకోవడం..ఆ తర్వాత నిందితుని నుంచి వివరాలు రాబట్టడం.. రెండింటిని సరిపోల్చుకోవడంపై దృష్టిపెట్టారు. సెల్‌ఫోన్లు, కాల్‌డేటా ఆధారంగా పొరుగు జిల్లాలు, రాష్ట్రేతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు బుధవారం తిరిగి విశాఖకు చేరుకున్నాయి. గుంటూరు, మధ్యప్రదేశ్, ఒడిస్సాలలో  నిందితుని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాల్‌ డేటా ఆధారంగా ఆయా ప్రాంతాల్లో పలువురి నుంచి వివరాలు రాబట్టారు. మరోవైపు... హత్యాయత్నం జరిగిన రోజున వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధరించిన రక్తపు గాయాలైన షర్ట్‌ను ఇప్పించాలని కోరుతూ విశాఖ మూడో మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సిట్‌ వేసిన పిటీషన్‌ బుధవారం కూడా విచారణకు రాలేదు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేని కారణంగా వరుసగా రెండోరోజు కూడా ఈకేసును న్యాయమూర్తి వాయిదా వేశారు. నిందితుడి జేబులో ఉందని చెబుతున్న 11 పేజీల లేఖలోని దస్తూరిని పరీక్షిం చేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ బుధవారం మరో పిటీషన్‌ ఫైల్‌ చేశారు.అవసరమైతే కస్టడీ పొడిగింపుపై చివరి రోజు నిర్ణయం తీసుకుంటామని సిట్‌ వర్గాలు చెప్పుకొచ్చాయి.

కాల్‌డేటాలో ముఖ్యులు: ఏసీపీ అర్జున్‌
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసరావు కాల్‌డేటాలో కొంతమంది ముఖ్యులు కూడా ఉన్నారని, వారినీ విచారిస్తామని విశాఖ నార్త్‌ ఏసీపీ లంక అర్జున్‌ విలేఖరులకు వెల్లడించారు. ఇటీవల కాలంలో శ్రీనివాస్‌ 321 మందితో మాట్లాడినట్టు అతని కాల్‌డేటాను బట్టి నిర్ధారించామని వాటి ఆధారంగా కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని ఫోన్‌ ద్వారా విచారిస్తున్నామని తెలిపారు. గతంలో నిందితుడితో సహోద్యోగిగా పనిచేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి విచారిస్తున్నామన్నారు.

నిందితుడి తల్లిదండ్రుల విచారణ
 తనకు ప్రాణహాని ఉందంటూ నిందితుడు వైద్యపరీక్షల సందర్భంగా కేజీహెచ్‌లో మీడియా ఎదుట కేకలు వేయడంతో ఆందోళనకు గురైన అతని తల్లిదండ్రులు తాతారావు, సావిత్రమ్మలు తమ కుమారుడ్ని చూడాలని ఉందని చెప్పడంతో పోలీసులు వారిని బుధవారం రాత్రికి విశాఖకు తీసుకువచ్చారు. గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో రహస్యంగా విచారిస్తున్నారు. ఉందయం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను సిట్‌  బృందం వారి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలో విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితుడి ఇంటి వద్ద, గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 26 మందిని విచారించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి చెందిన ఓవ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top